
వర్సిటీ.. ఇదేమిటి!
విద్యా పరిమళాలు వెదజల్లాల్సిన యూనివర్సిటీలో గంజాయి వాసన గుప్పుమంటోంది. డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలైన కొంతమంది విద్యార్థులు వర్సిటీ వాతావరణాన్ని కలుషితం, భయానకంగా మార్చేస్తున్నారు. ఉన్నత ఆశయాలతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయంలో చేరుతున్న స్టూడెంట్లు అసాంఘిక శక్తులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
శంకర్‌పల్లి: భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పెడదోవపడుతున్నారు. నిత్యం ర్యాగింగ్, గంజాయి, ఘర్షణల్లో భాగం అవుతున్నారు. శంకర్‌పల్లి మండలం దొంతన్‌పల్లిలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయ్) విశ్వవిద్యాలయాన్ని 2008లో ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రూ.లక్షలు వెచ్చించి మరీ అడ్మిషన్ తీసుకుంటున్నారు. పిల్లల చదువు కోసం ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు కళాశాలలోని హాస్టళ్లతో పాటు బయట ఉన్న ప్రైవేటు వసతి గృహాల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు నిత్యం బయటకు వచ్చి వికృత చేష్టలు, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. కానీ వీరిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తుండడం గమనార్హం.
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్..
ఈనెల 4న కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం, వారికి సరఫరా చేసింది సైతం కళాశాల విద్యార్థే కావడం సంచలనం రేపింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి, కౌన్సెలింగ్, నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఇంత మంది విద్యార్థులు డ్రగ్స్ టెస్టులో దొరికినా సోదాలు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని ఘటనలు..
● 2022 నవంబర్ 1న చోటుచేసుకున్న సంఘటన కళాశాలని కుదిపేసింది. ఇద్దరూ బీబీఏ విద్యార్థులు ప్రేమించుకొని, గొడవ పడ్డారు. అమ్మాయి వెళ్లి బంధువైన సీనియర్‌కి విషయం చెప్పింది. అది కాస్తా సీనియర్స్, జూనియర్స్ గొడవగా మారింది. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యాజమాన్యం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
● 2023 ఫిబ్రవరి 10న కళాశాల ఎదుట ముగ్గురు బయటి వ్యక్తులు బైక్ మీద వచ్చి విద్యార్థులకు లిక్విడ్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. విద్యార్థులు తప్పించుకోగా అమ్మడానికి వచ్చిన వారిపై పోలీసులు ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
● 2019 జనవరి 19న అర్ధరాత్రి ఓ ఎంబీఏ విద్యార్థిని కళాశాల బయట తిరుగుతుండగా ఓ దాబా నిర్వాహకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె మద్యం తాగి ఉనట్లు సమాచారం.
ఇష్టారీతిన వాహనాల పార్కింగ్
పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు కనీసం పార్కింగ్ సౌకర్యం కల్పించలేదు. నిత్యం కళాశాలకు సొంత వాహనాల్లో వచ్చే విద్యార్థులు వారి వాహనాలను హైదరాబాద్– శంకర్‌పల్లి ప్రధాన రోడ్డు పక్కన ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొంతమంది విద్యార్థులు కళాశాల ముందు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వందల రూపాయలు చెల్లించి నిలుపుతున్నారు.
తరచూ వార్తల్లో
ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం
పెడదోవ పడుతున్న పలువురు విద్యార్థులు
ఆందోళన కలిగిస్తున్న
ర్యాగింగ్, గంజాయి, ఘర్షణలు
వెలుగు చూస్తున్న పలు ఘటనలు
పట్టించుకోని అధికారులు, పోలీసులు
చర్యలు తీసుకోవాలి
కొంతమంది విద్యార్థులు రాత్రి వేళ ఇబ్బందికర దుస్తులు వేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కుటుంబంతో వెళ్లే సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలి.
– చంద్రశేఖర్, దొంతాన్‌పల్లి

వర్సిటీ.. ఇదేమిటి!