
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కొందుర్గు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి మహదేవ్‌పూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, బల్లికురువ మండలం, కొర్రపాలెం గ్రామానికి చెందిన కుంచాల రఘువీర్(36) రెండేళ్ల క్రితం షాద్‌నగర్ ప్రాంతానికి వలస వచ్చాడు. తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రేగడిచిల్కమర్రిలో పనిచేస్తున్నాడు. కొందుర్గులో మరో సైట్ వద్ద పని ఉందని బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మహదేవ్‌పూర్ చెరవుకట్టపై మధ్యాహ్నం 12.30 గంటలకు అతని బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడి బావ మరిది కల్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు..
ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు ఇనప రాడ్ తగిలి ఓకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన శివ నాగరాజు(34) భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పోచారం గ్రామంలో నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుప రాడ్‌ను భవనం పైకి తీసుకెళ్తున్న క్రమంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌తో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది.
మార్టిగేజ్ విధానంపై వివరణ ఇవ్వండి
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో భవన నిర్మాణాలకు మార్టిగేజ్ విధానం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ, బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ కంటోన్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో 200 చదరపు మీటర్లకు పైబడిన నిర్మాణాలకు మాత్రమే అమల్లో ఉన్న మార్టిగేజ్ విధానాన్ని, కంటోన్మెంట్‌లో కేవలం 111 చదరపు మీటర్ల నుంచే అమలు చేయడం దారుణమన్నారు. సామాన్య, మధ్యతరగతి కంటోన్మెంట్ ప్రజల సొంతింటి కలను జఠిలం చేసే ఈ చర్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా తాను డిమాండ్ చేశానన్నారు. బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో భాగంగా మార్టిగేజ్ విధానం అమలు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధానం వల్ల చిన్న ప్లాట్‌లలో నిర్మాణాలు చేపట్టే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కఠినమైన కంటోన్మెంట్ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. జీహెచ్‌ఎంసీని ఆదర్శంగా తీసుకునే బోర్డు అధికారులు, అదే తరహా నిబంధనలు అమలు చేయాలన్నారు.
రచన జర్నలిజం కళాశాలలో
అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
హిమాయత్‌నగర్ : నారాయణగూడలో రచన జర్నలిజం కళాశాలలో రెగ్యులర్, కరస్పాండెన్‌న్స్ విధానంలో జర్నలిజంలో పీజీ డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లమా కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సులో చేరేందుకు 10వ తరగతి పాసైనవారు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ : 040–23261335 లేదా 9959640797 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
14 ప్రవక్త మహ్మద్ జయంతి సభ
సాక్షి,సిటీబ్యూరో: తామీర్–ఎ–మిల్లత్ 76వ ’యౌమ్–ఎ–రహ్మతుల్ లిల్ ఆలమీన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తామీర్–ఎ–మిల్లత్ అధ్యక్షుడు ముహమ్మద్ జియావుద్దీన్ నయ్యర్ పర్యవేక్షణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పండితులు, మేధావులతో పాటు స్థానిక ఉలమాలు హాజరుకానున్నారు. రెండో రోజు 15న రాత్రి చంచల్‌గూడ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ’యౌమ్–ఎ–సహాబా’ ఉంటుందని సభ నిర్వాహకులు తెలిపారు.