
ఆవులను తరలిస్తున్నకంటైనర్ పట్టివేత
గోశాలకు మూగజీవాల తరలింపు
నందిగామ: గుట్టు చప్పుడు కాకుండా 32 ఆవులను తరలిస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని నందిగామ పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూరం జిల్లా నుంచి హైదరాబాదు వైపునకు భారీ వాహనంలో ఆవులను తరలిస్తున్నారనే విషయాన్ని హిందూ జన జాగ్రృతి సమితి కార్యకర్త రఘువీర్ సింగ్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బైపాస్ రహదారిపై కాపు కాసి, వాహనాన్ని పట్టుకున్నారు. అందులోని మూగజీవాలను నగరంలోని సమర్ధ గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
ఇబ్రహీంపట్నం: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎలిమినేడు గ్రామ పరిధిలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు డాడులు చేశారు. జూదరులను పట్టుకొన్నారు. నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.