
ఇదేమి ఆదర్శం!
మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలో పేదలకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులను పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్ల శుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు నిధులను వెచ్చిస్తారు. అ మ్మ ఆదర్శ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడు, స్థానిక గ్రామ పంచాయతీలోని మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రతీ తరగతి నుంచి ముగ్గు రు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు.
స్కావెంజర్ల వేతనాల్లో స్కాం!
మహేశ్వరం ప్రభుత్వ మోడల్ స్కూల్‌లోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద స్కావెంజర్ల జీతాల కోసం వచ్చే నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ ప్రిన్సిపాల్ గోపి నిధులను దారి మళ్లిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలలో 825 మంది విద్యార్థులున్నారు. వీరి సంఖ్యకు అనుగణంగా 2024 ఆగస్టు నుంచి నెలకు రూ.20 వేల చొప్పున స్కావెంజర్ల జీతాల కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నాయి. ఇద్దరు స్కావెంజర్లను నియమించి వారికి రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూ.7 వేల చొప్పున ఇస్తూ రూ.6 వేలు పక్కదారి పట్టిస్తున్నారని స్కావెంజర్లు ఆరోపిస్తున్నారు.
పని మానేసిన స్కావెంజర్లు
మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రాంగణం విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పాటు 825 మంది విద్యార్థులున్నారు. దీంతో మరుగుదొడ్ల శుభ్రత, మొక్కల సంరక్షణ కష్టంగా ఉందని రూ.7 వేలకు పనిచేయలేమని లక్ష్మయ్య, మల్లీశ్వరి మరో ఇద్దరు మహిళలు మానేశారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా రూ.10వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఎనిమిది నెలల వేతనం పక్కదారి పట్టించిన సదరు ప్రిన్సిపాల్ గోపిని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మహేశ్వరం మోడల్ స్కూల్‌లో స్కావెంజర్ల వేతనాల్లలో అవకతవకలు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకం దారి మళ్లింపు
ఆరు నెలల పాటు శ్రమదోపిడీ చేశారని ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు