
ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025
బండ్లగూడ: ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కరప్షనల్ సర్వీస్స్ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్ట మని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్ల శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసె ర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బీపీఆర్‌అండ్‌డి) సంయుక్తంగా నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రా లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,222 మంది పోటీదారులు, 144 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రొఫెషనల్, క్రీడలు, సాహిత్యం, కళల విభాగాల్లో మొత్తం 36 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇది కేవలం పోటీ వేదిక మాత్రమే కాదని.. జైలు సిబ్బందిలో క్రమ శిక్షణ, ప్రతిభ, ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీపీఆర్‌డీ అదనపు డైరెక్టర్ జనరల్ రవిజోసఫ్ లోక్కు, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, హోం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ అన్ని కన్‌టిజెంట్‌ల మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. జైళ్ల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణకు ఈ వేదిక లభించడం గర్వకారణమన్నారు. రవిగుప్తా మాట్లాడుతూ.. డ్యూటీ మీట్ అనేది కేవలం పోటీ కాదని, దేశవ్యాప్తంగా జైలు సిబ్బందిలో స్నేహభావం, జ్ఞాన మార్పిడి, ఆవిష్కరణలకు వేదిక అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. జైలు సిబ్బంది కనబడని హీరోలని, జైళ్లు శిక్షా గృహాలు కాకుండా పునరావాస, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు గా మారుతున్నాయన్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జైలు సిబ్బంది నిశ్శబ్ధ సేవలను కొనియాడుతూ టెక్నాలజీ ఎగ్జిబిషన్, ప్రిజన్ ప్రొడక్ట్స్ స్టాల్స్‌ను ముందు చూపు చర్యగా అభివర్ణించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ జైలు సిబ్బందిలోని క్రమ శిక్షణ, అంకితభావం ప్రశంసనీయమని తెలంగాణ జైలు శాఖ ఈ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నా రు. డ్రోన్లు, రోబోటిక్స్, ఏఐ సిస్టమ్స్, స్కానర్లు, కాంట్రాబాండ్ డిటెక్షన్ టెక్నాలజీలు ప్రదర్శనలో ఉంచారు. ఈ మీట్‌లో వచ్చే మూడు రోజులు పోటీలు, క్రీడలు కళాప్రదర్శనలు, అనుభవాల మార్పిడి జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 11న వాలెడిక్టరీ ఫంక్షన్‌తో ముగియనుందన్నారు. ఈ మహోత్సవం సాంప్రదాయం–సాంకేతికత, క్రమశిక్షణ, కరుణ, పోటీ, స్నేహభావం కలయికగా చరిత్రలో నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.