
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొప్పు బాషా
యాచారం: గ్రామానికి చెందిన కొప్పు బాషా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరం నుంచి ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో కీలక పదవులు నిర్వర్తించారు. ఈ క్రమంలో తన సతీమణి సుకన్యను యాచారం ఎంపీపీగా పదవీలో కూర్చోబెట్టారు. అనంతరం బండి సంజయ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులాల్లోని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజీలేని పోరాటం చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పు భాషా మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.
వ్యక్తి బలవన్మరణం
షాద్‌నగర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ శివారులోని కీర్తి వెంచర్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌లోని వివేకానంద కాలనీకి చెందిన చాపల గోపాల్(39) ఓ పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు లేక పోవవడం, అవివాహితుడు కావడంతో తన అన్న శేఖర్‌వద్దే ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి కాకపోవడంతో మనస్థాపంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం కీర్తి వెంచర్ సమీపంలో రైలు కిందపడి ఆతహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు, ఏటీఎం కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొప్పు బాషా