
యూరియా కోసం ఆందోళన వద్దు
యాచారం: యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానో యూరియా వాడకంతో 8 శాతం అధికంగా పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఆర్థిక భారం సైతం తగ్గిస్తుందన్నారు. యూరియా బస్తా రూ.266.50 ఉంటే, రూ.225కు లభించే అర లీటర్ నానో యూరియా ఎకరా పొలానికి సరిపోతుందని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, కంది, పండ్ల, కూరగాయల పంటల్లో మంచి దిగుబడి వస్తుందన్నారు. రైతులు సాగు చేసిన పంటలను వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి రవినాథ్, వివిధ గ్రామాలకు చెందిన విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.