
సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్‌కు!
అడ్డూ అడుపు లేకుండా దందా
తీసుకోవడానికి లబ్ధిదారుల అనాసక్తి
● సొమ్ము చేసుకుంటున్న రేషన్ డీలర్లు
● కిలోకు రూ.12 చొప్పున కొనుగోలు
● పట్టని పౌరసరఫరాల శాఖ
సాక్షి, సిటీబ్యూరో: బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’ నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలోకు రూ.12 చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది.
సన్నబియ్యంపై కూడా..
పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దోశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబ్ధిదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక యూనిట్ బియ్యమే..
కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబ్ధిదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచ ప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్ అమలుతో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబ్ధిదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్ డ్రెవ్ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది.