
ఏసీబీకి చిక్కిన నార్సింగి టీపీఓ
● చేవెళ్లలో చర్చనీయాంశం
● మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మణిహారిక
చేవెళ్ల: నార్సింగి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడినట్లు తెలియడంతో చేవెళ్లలో కలకలం రేగింది. నార్సింగిలో పట్టుబడిన మణిహారిక చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఇన్‌చార్జిగా ఎనిమిది నెలల నుంచి కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ కూడా ఆమె వ్యవహారం ఎలా ఉందనే దానిపై స్థానికంగా చర్చించుకున్నారు. మున్సిపల్ పరిధిలో కొత్త నిర్మాణాలు, ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల విషయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ వ్యవహారం టౌన్‌ప్లానింగ్ అధికారులే చూడాల్సి ఉండడంతో ప్లాట్లు పరిశీలనకువస్తే వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మణిహారిక ఏసీబీకి పట్టుబడడంతో అధికారులు చేవెళ్ల మున్సిపాలిటీలో కూడా విచారణ చేస్తారన్న ప్రచారం జరిగింది. మంగళవారం మాత్రం కార్యాలయానికి ఎవరూ రాలేదు. కాగా ఎల్‌ఆర్‌ఎస్ సెకండ్ స్టేజీలో టౌన్‌ప్లానింగ్ అధికారి క్లియర్ చేయాల్సి ఉండగా ఆమె వద్ద ఫైల్స్ పెండింగ్‌లో ఉండటంతో దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం.