
జర్నలిస్టులపై దాడులను సహించం
నందిగామ: జర్మలిస్టు సందీప్‌పై అకారణంగా దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడులు చేస్తే ఎంతటి వారైన సహించేది లేదని టీయూడబ్ల్యూఎఫ్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ అన్నారు. మండలానికి చెందిన జర్నలిస్టు సందీప్‌పై నందిగామకు చెందిన కొంతమంది యువకులు గణేశ్ నిమజ్జనం రోజు మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గ జర్నలిస్టులు సోమవారం పెద్దఎత్తున నందిగామ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌తో వారు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సూచనల మేరకు కొంత మంది యువకులు జర్నలిస్టు సందీప్‌పై అకారణంగా దాడి చేశారన్నారు. దాడి జరిగి రెండు రోజులైనా కూడా నేటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేసు విచారణ జరుపుతున్నామని, నిజనిజాలు తెలుసుకొని దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు ఖాజా పాషా, నరేశ్, లక్కాకుల రమేశ్, ఆంజనేయులుగౌడ్, నర్సింహారెడ్డి, యాదయ్య, వెంకన్న బాబు, చంద్రశేఖర్, నూరోద్దీన్, జగన్, మధుసూదన్ గౌడ్, శ్రీహరి, మహేశ్, వెంకటేశ్, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్