
ఆ స్తంభాలను తొలగించండి
● లేదంటే ఆత్మహత్య చేసుకుంటా
● సబ్‌స్టేషన్ ఎదుట రైతు ఆందోళన
మంచాల: తమ పొలంలో నాటిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఓ రైతు సోమవారం పెట్రోల్ డబ్బాతో సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి జాపాల గ్రామానికి చెందిన బక్కున మల్లప్పకు చెందిన వ్యవసాయ పొలం నుంచి శనివారం ప్రక్క రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ స్తంభాలను అమర్చారు. విషయం తెలుసుకున్న మల్లప్ప.. తమకు సమాచారం ఇవ్వకుండా పొలంలో స్తంభాలు ఎలా ఏర్పాటు చేశారని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏఈ బాజీసింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ పోల్స్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చాడు. రెండు రోజులు అయినా వాటిని తొలగించలేదని పేర్కొంటూ.. తాజాగా బాధిత రైతు నిరసన వ్యక్తం చేశారు. వాటిని తీయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. లేబర్ రాగానే మంగళవారం ఉదయం ఆ స్తంభాలను తొలగిస్తామని బాధిత రైతుకు హామీ ఇచ్చారు. అయినా సదరు వ్యక్తి వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మల్లప్పను ఠాణాకు తరలించారు.