
రేపు జాబ్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ ఆదివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు హైదరాబాద్‌లోని మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని రిటైల్, ఈ–కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. వివరాలకు 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చేవెళ్ల: ట్రాఫిక్ పోలీసు కేసుల పరిష్కారానికి సోమవారం నుంచి ఈనెల 13వ తేదీవరకు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మద్యం తాగి వాహనాలు నడిపించిన కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్ కేసులు తక్కువ జరిమానాతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆధార్‌కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లతో రావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 99632 95757, 94906 17461 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
షాద్‌నగర్‌రూరల్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఆవరణలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రెండు రోజులపాటు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె తెలిపారు. గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్ష పద్ధతి (ఆఫ్‌లైన్), పరోక్ష పద్ధతి (ఆన్‌లైన్)లో సెమినార్ ఉంటుందన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేవారు తగిన రుసుము చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని, ఉత్తమ ప్రజెంటేషన్ ఇచ్చిన వారికి బహుమతులు, ప్రజెంటేషన్‌లో పాల్గొన్న వారిందరికీ కిట్స్, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వివరాలకు 97034 41345, 97059 67553, 79010 97702 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
షాద్‌నగర్‌రూరల్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ(డిగ్రీ) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎంఎస్‌సీలో అడ్మిషన్ పొందాలనేకునే విద్యార్థినులు ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బీపీసీలో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఎస్టీలకు 30, బీసీలకు 2, ఎస్సీలకు 2, ఓసీలకు 2, అనాథ (ఆర్ఫాన్)లకు 2, స్పోర్ట్స్ కోటా కింద 2 సీట్లు ఉన్నట్టు తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేరుగా కళాశాలలో సంప్రదించాలని చెప్పారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థినులు డిగ్రీ, పీజీని పూర్తి చేసుకుంటారన్నారు. వివరాలకు 89789 42246, 97059 67553, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కందుకూరు: మండలంలోని లేమూరు పరిధి లోని శ్రీదేవి, భూదేవి సమేత స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం మాజీ మంత్రులు కె.జానారెడ్డి, జి.చిన్నారెడ్డి, డీకే సమరసింహారెడ్డి దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం గురించి ట్రస్ట్ చైర్మన్ గూడూరు కొండారెడ్డి, దేవాలయ విశిష్టత గురించి స్థపతి శివనాగిరెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఢిల్లీ గణేశ్, నాయకులు మూల భాస్కర్‌రెడ్డి, పాండు, కె.జైపాల్‌రెడ్డి, బాలకృష్ణ, ఐలయ్య, బీరప్ప, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.