
అలైన్‌మెంట్ మార్చి ఆగం చేస్తారా
ఆమనగల్లు: పెద్దోళ్ల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి పేదల బతుకులను ఆగం చేస్తారా అంటూ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిరసన చేపట్టారు. తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట, గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, చంద్రదన, ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆమనగల్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం ర్యాలీగా వచ్చి హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ధర్నాలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బడాబాబులు, భూస్వాముల భూములను రక్షించేందుకు కొత్తగా అలైన్‌మెంట్‌ను తీసుకువచ్చి సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఆమనగల్లులో భూ నిర్వాసితుల ఆందోళన
భూములు ఇచ్చేది లేదు
షాద్‌నగర్: ప్రాణాలైనా ఇస్తాం కానీ రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ట్రిపుల్‌ఆర్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ట్రిపుల్‌ఆర్ భూసేకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మిస్తున్న రీజనల్ రింగురోడ్డు తమ వ్యవసాయ భూముల నుంచి వెళ్తోందని, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంలో భూములు పోతే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రంగయ్య, మాజీ సర్పంచ్‌లు భీమయ్య, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.