
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
శంకర్‌పల్లి: కరాటే నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని మోకిలలోని ఓ ప్రైవేట్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సక్సెస్ షోటోకాన్–2025 చాంపియన్ పోటీలను మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ప్రారంభించగా.. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. పోటీలను టి.కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా మోకిలకి చెందిన మన్నె వెంకటేశ్ స్పాన్సర్ చేశారు. పలు జిల్లాలకు చెందిన సుమారు 500 మంది 5 నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులు తమ ప్రతిభ చాటారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ టెక్నికల్ అడ్వజైర్ రవీందర్, ఫౌండర్ అనిల్ కుమార్, కోచ్‌లు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.