
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి
ఆమనగల్లు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని, లేదంటే భూ నిర్వాసితులతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పగడాల యాదయ్య హెచ్చరించారు. కొత్త అలైన్‌మెంట్‌తో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని మాలెపల్లి సమీపంలో శనివారం ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులైన మాలెపల్లి, చింతలపల్లి, మేడిగడ్డ, సింగంపల్లి, నుచ్చుగుట్టతండా, పోలెపల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి ట్రిపుల్‌ఆర్‌తో పోతోందని ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పగడాల యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఏకపక్షంగా ప్రకటించి రైతులను గందరగోళంలో పడేసిందని ఆరోపించారు. సరైన సర్వే నిర్వహించకుండా అలైన్‌మెంట్ పేరుతో సర్వే నంబర్లు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఉన్న అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జగన్, సీపీఎం ఆమనగల్లు ఏరియా కన్వీనర్ శివశంకర్, మాజీ సర్పంచ్ శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.