సిటీ పోలీసులోకి ‘లాడెన్‌ జాగిలాలు’ | - | Sakshi
Sakshi News home page

సిటీ పోలీసులోకి ‘లాడెన్‌ జాగిలాలు’

Sep 6 2025 9:12 AM | Updated on Sep 6 2025 9:12 AM

సిటీ పోలీసులోకి ‘లాడెన్‌ జాగిలాలు’

సిటీ పోలీసులోకి ‘లాడెన్‌ జాగిలాలు’

సాక్షి, సిటీబ్యూరో: పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ కనుగొనటం కోసం అమెరికన్‌ నేవీ సీల్స్‌ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్‌ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్‌ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ కావడం గమనార్హం. పోలీసు విభాగం సుదీర్ఘకాలం జర్మన్‌ షెపర్డ్‌, లాబ్రెడార్‌ తదితర జాతి జాగిలాలకు శిక్షణ ఇచ్చి వినియోగించింది. అయితే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) కొన్నేళ్ల క్రితం 300 బెల్జియం మలినాయిస్‌ జాగిలాలను ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించింది. 2015లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషనల్‌ విభాగమైన ఆక్టోపస్‌లో వినియోగించడానికి ప్రయోగాత్మకంగా మూడు (రెండు మగ, ఒక ఆడ) బెల్జియం మలినాయిస్‌ జాగిలాలను ఖరీదు చేశారు. వీటి పనితీరును అధ్యయనం చేసిన నగర పోలీసు అధికారులతో కూడిన కమిటీ సర్వకాల సర్వావస్థల్లోనూ విసుకు, విరామం లేకుండా ఏకధాటిగా పని చేయడం, పౌరుషం తదితర లక్షణాలను పరిగణలోకి తీసుకుంది. దశల వారీగా నగర పోలీసు విభాగంలో బెల్జియం మలినాయిస్‌, బీగల్‌ జాతి జాగిలాల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్జియం మలినాయిస్‌ జాతి జాగిలం గరిష్టంగా 12 ఏళ్లు జీవిస్తుంది. ఇది 22 నుంచి 26 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంది. 20 నుంచి 30 కేజీల బరువు కలిగి ఉంటుంది. పౌరుషం, సంగ్రహణ శక్తుల్లో ఉత్తమమైన వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా తేలిక.

త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తాం

గోషామహల్‌లోని పోలీసుస్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకోగా మిగిలిన 11.5 ఎకరాల్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నాం. వీటిలో ఓపక్క అశ్వకదళం (మౌంటెడ్‌ పోలీసు) కోసం స్టేబుల్స్‌, మరోపక్క జాబితాల కోసం కెన్నెల్‌ నిర్మించనున్నాం. ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో ఉన్న 50 గుర్రాల్లో మూడు తప్ప మిలినవి అన్నీ యాక్టివ్‌గా ఉన్నాయి. కీలక సందర్భాల్లో క్రౌడ్‌కంట్రోల్‌కు ఇవి అత్యంత కీలకం. 2003లో నేను సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా ఉండగా చేప ప్రసాదం పంపిణీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో తొక్కిసలాట వరకు విషయం వెళ్లినా... అక్కడ ఉన్న మౌంటెడ్‌ పోలీసు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

– సీవీ ఆనంద్‌, నగర కొత్వాల్‌

బెల్జియం మలినాయిస్‌ జాతివి సైతం కొనుగోలు

తొలిసారిగా నేరుగా ఖరీదు చేసిన సిటీ పోలీసులు

11.5 ఎకరాల్లో కెన్నెల్స్‌, స్టేబుల్స్‌

సీవీ ఆనంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement