
కారు బీభత్సం
కడ్తాల్: మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి, రోడ్డు పక్కన నిలబడిన వారిని ఢీకొడుతూ ఫుట్‌పాత్‌ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం బారిన పడిన దంపతుల్లో భర్త మృతిచెందగా, భార్యతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని చల్లంపల్లి వద్ద ఓ తోటలో కూలీ పనులు చేసేందుకు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా, నల్లమడ మండలం, కొండ్రవారిపల్లికి చెందిన జిన్నె రంగులు(54), ఆదిలక్ష్మి దంపతులతో పాటు నర్సపూర్ కిష్టప్ప శుక్రవారం ఉదయాన్నే బస్సులో ఏపీ నుంచి కడ్తాల్‌కు వచ్చారు. చల్లంపల్లి వెళ్లేందుకు శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నిలబడి ఆటోల కోసం వేచి చూస్తుండగా హైదరాబాద్ నుంచి డిండి వైపు వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగులు, ఆదిలక్ష్మిని అంబులెన్స్‌లో ఉస్మానియాకు కిష్టప్పను వెల్దండలోని యెన్నం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం రంగులు మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
ఉదయం ఆరు గంటలకే జరిగిన ఘటనతో పెను ప్రమాదమే తప్పింది. అదుపు తప్పిన కారు అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన నిలబడిన వారితో పాటు చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకున్న కొట్టులను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అప్పటికీ షాపులు తీయకపోవడం, వేకువజామునే కావడంతో జనసందడి లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రధాన కూడలిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొనసాగుతున్న వ్యాపారాలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి దూసుకెళ్లిన వాహనం
వలస కూలీ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కడ్తాల్‌లోని శ్రీశైలం– హైదరాబాద్ రహదారిపై ఘటన

కారు బీభత్సం