చిన్నారిని చిదిమేసిన కారు | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన కారు

Sep 6 2025 9:12 AM | Updated on Sep 6 2025 9:12 AM

చిన్నారిని చిదిమేసిన కారు

చిన్నారిని చిదిమేసిన కారు

షాద్‌నగర్‌ రూరల్‌: ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ ఘటన శుక్రవారం పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్వర్‌ తెలిపిన ప్రకారం.. కొందర్గు మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన బుట్ట గోపికృష్ణ, మీనాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు. గోపికృష్ణ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీలో కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుమారుడు విరాట్‌(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గోపికృష్ణ ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో అదే కాలనీకి చెందిన అన్వేష్‌ తన థార్‌ వాహనాన్ని పార్క్‌ చేస్తున్నాడు. ఆయన తన వాహనాన్ని వెనక్కు తీస్తున్న క్రమంలో కారు వెనకాల ఉన్న చిన్నారిని గమనించలేదు. దీంతో బాలుడు వాహనం చక్రాల కింద పడిపోయాడు. వెంటనే గమనించి షాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం

ఆమనగల్లు: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తలకొండపల్లి మండలం జూలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రకంటి నర్సింహ(45)కు ఇరవై ఏళ్ల క్రితం పద్మతో వివాహమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింహ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరేసుకున్నాడు. మృతుడి అన్న కుమారుడు శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాబీలాన్‌ పబ్‌పై కేసు నమోదు

బంజారాహిల్స్‌: నిబంధనలకు ఉల్లంఘించి గడువు ముగిసిన తర్వాత అర్ధరాత్రి దాకా కొనసాగుతున్న పబ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–36/10లో ఉన్న బాబీలాన్‌ పబ్‌ నుంచి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపిస్తుండడంతో పాటు ప్రజలు గుమికూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరా తీయగా గడువు ముగిసిన తర్వాత కూడా డీజే కొనసాగించడంతో పాటు కస్టమర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో బాబీలాన్‌ పబ్‌ మేనేజర్‌ ఆసిఫ్‌తో పాటు డీజే ఆర్టిస్ట్‌ యశ్వంత్‌పై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

అత్తాపూర్‌: గణేశ్‌ నిమజ్జనానికి వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇటుక లారీ ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐలు చిలుకల శ్రీను, జయరాజ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లి వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన సన్నీ(15) స్నేహితులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గణేష్‌ నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్నాడు. పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే 310 పిల్లర్‌ వద్ద రోడ్డు దాటుతుంగా వేగంగా వచ్చిన ఇటుక లోడ్‌ లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement