
ఇక్ఫాయ్ గుర్తింపు రద్దు చేయాలి
● బీఆర్‌ఎస్‌వీ నేతల డిమాండ్
● యూనివర్సిటీ గేట్ ఎదుట ఆందోళన
శంకర్‌పల్లి: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వర్సిటీ గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడటం బాధాకరమైన విషయమన్నారు. నిర్వాహకుల అసమర్థతతోనే ఈదుస్థితి నెలకొందని మండిపడ్డారు. యూనివర్సిటీలో డ్రగ్స్, గాంజా విక్రయాలు, వినియోగం అధికంగా ఉందన్నారు. ఎనిమిది మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం ఇక్కడి పరిస్థితిని సూచిస్తోందని తెలిపారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న మోకిల సీఐ ఆందోళనకారులను అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. వీరిలో బీఆర్‌ఎస్‌వీ హైదరాబాద్ సెక్రటరీ రహమత్, నాయకులు శ్రీకాంత్, నాగేంద్రబాబు, రాకేశ్, దయాకర్, ఆఫ్రిద్, విజయ్, ఆసిఫ్, ఫృథ్వీ, రవికుమార్ తదితరులు ఉన్నారు.