
కారు అదుపుతప్పి.. వాగులో పడి
యువకుడి దుర్మరణం
చేవెళ్ల: కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి వాగులో పడడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన గుడిపల్లి నితీష్‌రెడ్డి(27) వ్యవసాయంతోపాటు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఆయనకు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వినాయక మండపాల వద్ద జరిగిన అన్నదానాలు, పూజలు, భజన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అర్ధరాత్రి వ్యవసాయ పొలాల వైపు పని నిమిత్తం వెళ్తుండగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కారు బురదలో జారడంతో చేవెళ్ల–పామెన లింక్‌రోడ్డుపై ఉన్న పెద్ద వాగు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కారు ఎగిరి వాగులో పడడంతో యువకుడు అందులో ఇరుక్కుపోయారు. వాగులో నీరు కారులోకి రావటంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఉదయం అటువైపు వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి చూస్తే నితీష్‌రెడ్డిగా గుర్తించారు. యువకుడు మృతితో భార్య, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి నితీష్‌రెడ్డి బీజేపీ పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. బుధవారం విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ తదితరులు నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.