కాటేస్తున్న కరెంట్‌! | - | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కరెంట్‌!

Sep 4 2025 8:40 AM | Updated on Sep 4 2025 8:40 AM

కాటేస్తున్న కరెంట్‌!

కాటేస్తున్న కరెంట్‌!

అవగాహన లేకే..

సాక్షి, రంగారెడ్డి: ఎల్సీ (లోడ్‌ రిలీఫ్‌) తీసుకున్నామనే ధీమా.. అతి విశ్వాసం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. వెరసి కార్మికులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వినియోగదారుల ఇళ్లలో వెలుగులు నింపుతూ.. వారి కుటుంబాల్లో మాత్రం చీకట్లు మిగుల్చుతున్నారు. విద్యుత్‌ స్తంభం ఎక్కే ముందు కరెంట్‌ ఉందో? లేదో ఎర్తింగ్‌ రాడ్‌తో చెక్‌ చేసుకోవాలని విద్యుత్‌ శాఖ సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలోని కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే స్తంభాలు ఎక్కేస్తున్నారు. ఫలితంగా వినియోగదారుల ఇళ్లలోని ఇన్వెర్టర్లు, జనరేటర్ల నుంచి కరెంట్‌ రివర్స్‌ సప్లయ్‌ అవుతుండటంతో విద్యుత్‌షాక్‌కు గురై మృత్యువాతపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆర్టిజన్లు మృత్యువాత పడ్డారు.

లైన్ల నిర్వహణలో కీలకం

విద్యుత్‌ లైన్ల నిర్వహణ, కనెక్షన్ల జారీ, సరఫరా, బిల్లుల జారీ, వంటి పనుల్లో ఆర్టిజన్లే కీలకం. డిస్కం పరిధిలో 23 వేల మంది ఆర్టిజన్లు పని చేస్తున్నారు. వీరిలో గ్రేటర్‌ పరిధిలోని 6,500–7000 మంది కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్‌ లైన్ల నిర్వహణలో ఆర్టిజనన్లదే కీలక పాత్ర. కొత్త లైన్లు వేయడం, విద్యుత్‌ స్తంభాలు పాతించడం, పాడైన వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్తవి అమర్చడం, లూజైన లైన్లు గుర్తించి సరి చేయడం, కనెక్షన్లు ఇచ్చి మీటర్లు అమర్చడం, హెచ్చుతగ్గుల సమస్యను నివారించడం, కాలిపోయిన ఫీజులను సరి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించడం, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వంటి కీలక పనులు వీరే చేయాల్సి ఉంటుంది.

కనీస జాగ్రత్తలు తీసుకోకుండా..

లైన్ల కింద పని చేసేవారు విధిగా తలకు హెల్మెట్‌, చేతులకు గ్లౌస్‌లు ధరించాలి. స్తంభాలపైకి ఎక్కినప్పుడు విధిగా నడుముకు సేఫ్టీ తాడు బిగించుకోవాలి. తీగలను తాకడానికి ముందే ఎర్త్‌రాడ్‌, టెస్టర్‌తో కరెంట్‌ సరఫరా ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. లైన్లకు ఇరు వైపులా ఏమైనా అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సంస్థలు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. కరెంట్‌ సరఫరా అవుతున్న ఫీడర్‌, డీటీఆర్‌ను గుర్తించి వాటిపై సరఫరా నిలిపివేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా అతి విశ్వాసంతో స్తంభాలు ఎక్కి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సేఫ్టీ టూల్స్‌ అందజేయాల్సి ఉన్నా డిస్కం పరిధిలోని కార్మికులకు కనీసం టెస్టర్‌ కూడా సరఫరా చేయడం లేదనే విమర్శలు లేకపోలేదు.

కొన్ని ప్రమాద ఘటనలు

● శంషాబాద్‌ మండలం సంఘీగూడ చౌరస్తాలోని విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కోసం ఆర్టిజన్‌ అనిల్‌కుమార్‌ స్తంభాన్ని ఎక్కాడు. ఎల్సీ తీసుకున్నాడు. తీరా స్తంభం ఎక్కిన తర్వాత పవర్‌ రివర్స్‌తో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

● కందుకూరు మండలం సాయిరెడ్డిపల్లె సమీపంలోని అమ్మాలబావి తండా పొలాల వద్ద కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. లైన్‌మెన్‌ వెంకటయ్య, ముచ్చర్లకు చెందిన ఒప్పంద కార్మికుడు శివకుమార్‌గౌడ్‌(24)తో కలిసి అక్కడికి వెళ్లి 20 నిమిషాల్లో లైన్లకు మరమ్మతులు పూర్తి చేశారు. తర్వాత విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన జంపర్లను కలిపేందుకు మరో స్తంభం వద్దకు వెళ్లారు. ఎల్సీ తీసుకునేందుకు సబ్‌స్టేషన్‌లోని సిబ్బందితో లైన్‌మెన్‌ వెంకటయ్య ఫోన్‌లో మాట్లాడుతుండగానే శివకుమార్‌ స్తంభంపైకి ఎక్కడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. అంతలోని సరఫరా నిలిచిపోవడంతో గాయాలపాలైన శివకుమార్‌ వైర్లమధ్యే చిక్కుకుని విలవిల్లాడాడు. సమీపంలో ఉన్న రైతులు తాళ్ల సాయంతో స్తంభంపై నుంచి కిందికి దించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

● ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం వద్ద విద్యుత్‌ స్తంభంపై సాంకేతిక సమస్య తలెత్తింది. నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు జూనియర్‌ లైన్‌మెన్‌ రవికుమార్‌ సహా ఆర్టిజన్‌ బొమ్మ అశోక్‌కుమార్‌ వెళ్లి స్తంభంపైకి ఎక్కి లైన్లు సరి చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

విద్యుత్‌ స్తంభాలపై విగతజీవుల్లా..

ఎల్సీ తీసుకున్నా.. రివర్స్‌ సరఫరా

అవగాహన లేక కొందరు.. అతి విశ్వాసంతో మరికొందరు

మృత్యువాత పడుతున్న ఆర్టిజన్లు

కార్మికుల భద్రత యాజమాన్యానికి పట్టడం లేదు. 80 శాతం కార్మికుల వద్ద ఎలాంటి సేఫ్టీ టూల్స్‌ లేవు. ఉన్నవి సైతం పాడైపోయాయి. క్షేత్రస్థాయి కార్మికులకు ఏటా సేఫ్టీటూల్స్‌ అందిస్తున్నట్లు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఫీడర్లు, లైన్లపై చాలా మందికి కనీస అవగాహన ఉండటం లేదు. పవర్‌ రివర్సన్‌తో కార్మికులు షాక్‌కు గురవుతున్నారు.

– గాంబో నాగరాజు, విద్యుత్‌ కార్మిక సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement