
ఇబ్బందులు రానీయొద్దు
● నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయండి
● అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశ్ నిమజ్జనం సందర్భంగా చెరువులు వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సరూర్‌నగర్ మినీట్యాక్ బండ్‌ను జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. రూట్ మ్యాప్ ఆధారంగా ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా నిమజ్జనం సాఫీగా సాగేలా చూడాలని, అవసరమైన చోట బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. భారీ గణనాథులు నిమజ్జనం చేసే చోట అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జనం పూర్తయే వరకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. చెరువు కట్టపై వైద్య శిబిరాలతో పాటు అత్యవసర పరిస్థితి దృష్ట్యా అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. చెరువుకట్టపై పారిశుద్ధ్య సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా రు. భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి ప్రసాదం అందజేశారు. కలెక్టర్ వెంట ఈస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, కందుకూరు ఆర్డీఓ రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
సామగ్రి ధరలు పెంచితే కఠిన చర్యలు
ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలపై నియంత్రణ ఉంచాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయా ట్రేడర్స్‌తో మాట్లాడి ధరలు అదుపులో ఉండేలా చూడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు పెంచే వ్యాపారులతో కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధ వారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ధరల నియంత్రణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఇంటికి కావాల్సిన ఇసుకను మన ఇసుక మన వాహనం ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎప్పటికప్పుడు తమ ఇంటి నిర్మాణ పనుల దశలను ఆన్‌లైన్ మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు బిల్లుల చెల్లింపు ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.