
ఆసరా.. అంతేనా!
కొందరికే అవకాశం
● జాడలేని కొత్త పింఛన్లు
● అర్హుల ఎదురుచూపులు
● కార్యాలయాల చట్టూ ప్రదక్షిణలు
కేశంపేట: ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు అశగా ఎదురుచూస్తున్నారు. నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అర్హులకు నూతనంగా పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు ఆసరా పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు.
కార్యాలయాల చుట్టూ చక్కర్లు
వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వస్తే భరోసాతో బతకవచ్చని వృద్ధులు భావిస్తున్నారు. అలాగే ఇంటి పెద్దలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వితంతు మహిళలు ఈ సహాయంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని, ఒంటరి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించొచ్చని కొత్త పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో అర్హులైన వారు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయానికి పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకొని తిరుగుతున్నారు.
స్పష్టత కరువు
కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో 57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, విచారణ అనంతరం మంజూరు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ వయస్సు పెంచినట్టు గ్రామాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ చేయూత పింఛన్ సైట్‌లో 65 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్‌లకు అర్హులగా కన్పిస్తోంది. దీంతో గ్రామాల్లో 57 ఎళ్లు నిండిన వృద్ధులు అయోమయంలో పడ్డారు. వయస్సు నిర్ధారణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం పింఛన్ల మంజూరుకు కొందరికి మాత్రమే ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు మరణిస్తే ఆ పింఛన్‌ను పింఛన్‌దారు భార్య లేదా భర్తకు అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతూ దివ్యాంగులైన వారికి వృద్ధాప్య పింఛన్ నుంచి వికలాంగుల పింఛన్‌కు మారుస్తున్నారు. దివ్యాంగుల పింఛన్ పొందుతూ మరణించిన వారి పింఛన్‌ను వృద్ధాప్య పింఛన్‌కు అధికారులు మార్చడం లేదు.