
స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ
నందిగామ: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండలంలోని కన్హా శాంతి వనంలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్న శ్రీయోనెక్స్ సన్‌రైజ్ 79వ సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్– 2025 పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పే ఉత్తమ గురువు అని పేర్కొన్నారు. కోర్టులో పడిన ప్రతిసారీ లేచినిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, ప్రకాశ్ పదుకొనె, సైనా నెహ్వాల్, సాత్విక్, చిరాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. క్రీడాకారులు కేవలం పాయింట్లకోసమే కాకుండా దేశం కోసం, దేశ ప్రతిష్టకోసం ఆడాలని సూచించారు. క్రమశిక్షణే అసలైన కోచ్ అని, నిరంతర శ్రమనే అసలైన స్పాన్సర్‌అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే పట్టుదలే నిజమైన బలమని మార్గనిర్దేశం చేశారు. అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. త్వరలోనే జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో మన రాష్ట్రం నుంచి బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. మూడు రోజుల పాటు ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బీఏటీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రత్యేక క్రీడా పాలసీ
ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా శిక్షణ
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ