‘జంట’కు ట్రీట్‌మెంట్‌ | - | Sakshi
Sakshi News home page

‘జంట’కు ట్రీట్‌మెంట్‌

Sep 3 2025 7:57 AM | Updated on Sep 3 2025 7:57 AM

‘జంట’

‘జంట’కు ట్రీట్‌మెంట్‌

ఎస్టీపీల నిర్మాణం భేష్‌

మొయినాబాద్‌: హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు అందించే హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్టీపీల (సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.82.23 కోట్ల నిధులతో జలాశయాల ఎగువ ప్రాంతాల్లో నాలుగు ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణ పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు శరవేగంగా పనులు చేపడుతున్నారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే జంట జలాశయాలకు మురుగు ముప్పు తప్పుతుంది.

వ్యర్థ జలాలను అరికట్టేందుకు..

నగరవాసుల దాహార్తి తీర్చేందుకు నిజాం కాలంలో నిర్మించిన జంట జలాశయాలను మురుగు ముప్పు వెంటాడుతోంది. కొన్నేళ్లుగా జలాశయాల ఎగువ ప్రాంతాలైన మొయినాబాద్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, గండిపేట మండలాల్లో కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. మరోవైపు ఫాంహౌస్‌లు, విల్లాలు, ఇళ్లు, పరిశ్రమలు, హోటళ్లు, విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. దీంతో ఎగువ ప్రాంత గ్రామాల నుంచి భారీగా మురుగునీరు జలాశయాల్లో చేరుతుండడంతో కలుషితంగా మారుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్లు జలమండలి అధికారుల పరిశీలనలో తేలింది. దీన్ని అరికట్టేందకు హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ వాటర్‌ సప్‌లై, సివరేజ్‌ బోర్డు ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.82.23 కోట్ల నిధులతో నాలుగు సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒక్కో జలాశయం ఎగువ ప్రాంతంలో రెండు ఎస్టీపీల చొప్పున నిర్మాణ పనులను మొదలు పెట్టింది.

జలమండలి ప్రణాళికలు

జంట జలాశయాల్లో శుద్ధ జలమే లక్ష్యంగా జలమండలి చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గండిపేట జలాశయం పరిధిలో మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్‌ వద్ద 5 ఎంఎల్‌డీ, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ వద్ద 4 ఎంఎల్‌డీ, హిమాయత్‌సాగర్‌ జలాశయం పరిధిలో మొయినాబాద్‌ మండలంలోని నాగిరెడ్డిగూడ వద్ద 5 ఎంఎల్‌డీ, శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ వద్ద 6 ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేయడమే లక్ష్యంగా పనులను శరవేగంగా చేపడుతున్నారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే ఎగువ ప్రాంతంలోని గ్రామాలు, విల్లాలు, హోటళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని ఎస్టీపీల్లోకి మళ్లించి శుద్ధి చేయనున్నారు. 2050 నాటికి ఉత్పన్నమయ్యే మురుగునీటి అంచనాతో మన్నెగూడతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మురుగు ముప్పు తప్పించేందుకు..

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల ఎగువ ప్రాంతాల్లో నాలుగు ఎస్టీపీల నిర్మాణం

శుద్ధ జలమే లక్ష్యంగా జలమండలి చర్యలు

రూ.82.23 కోట్లతో శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు

వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసే యోచన

గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రభు త్వం ఎస్టీపీల నిర్మాణం చేపట్టడం గొప్ప విషయం. ఎగువ ప్రాంతంలోని గ్రామాల నుంచి జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా అరికట్టొచ్చు. తద్వారా జలాశయాలు కలుషితం కాకుండా ఉంటాయి. ఇది భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

– పల్లగొల్ల అశోక్‌యాదవ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, హిమాయత్‌నగర్‌

‘జంట’కు ట్రీట్‌మెంట్‌1
1/2

‘జంట’కు ట్రీట్‌మెంట్‌

‘జంట’కు ట్రీట్‌మెంట్‌2
2/2

‘జంట’కు ట్రీట్‌మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement