
కాళేశ్వరంపై కట్టుకథలు
● కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే..
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి
మీర్‌పేట: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ వంటిదని, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని నిరసిస్తూ మంగళవారం బాలాపూర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం అత్యద్భుతమని, 20 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు నివేదిక ఇచ్చిందని, ప్రాజెక్టులపై రాజకీయం చేయొద్దని చెప్పిందని గుర్తుచేశారు. అయినప్పటికీ తెలంగాణను బలి చేసైనా పక్క రాష్ట్రంలోని బనకచర్లకు నీరివ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి మేడిగడ్డను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓ వైపు మోదీ, మరోవైపు గురువు చంద్రబాబుకు మేలు చేసేందుకు రాష్ట్రాన్ని ఎండబెట్టాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, బీఆర్‌ఎస్ నాయకులు మురుకుంట్ల అరవింద్, అర్కల కామేశ్‌రెడ్డి, సునితా బాల్‌రాజ్, సూర్ణగంటి అర్జున్, జటావత్ శ్రీనునాయక్, పెండ్యాల నగేష్, అనిల్‌యాదవ్, బొక్క రాజేందర్‌రెడ్డి, మాదరి రమేష్ పాల్గొన్నారు.
కక్షపూరిత రాజకీయాలు
ఇబ్రహీంపట్నం: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెబతూ కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం సీబీఐ అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, యూరియా కొరతలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. యూరియ కొరతతో రైతులు అల్లాడుతుంటే పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఘోష్ కమిషన్ విచారణ ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, భరత్‌కుమార్, జంగయ్య, జెర్కొని రాజు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై కట్టుకథలు