
పెన్షన్ హామీ విస్మరించిన ప్రభుత్వం
షాద్‌నగర్‌రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే పెన్షన్ పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ ప్రశ్నించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచి ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి హామీని విస్మరించారని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత పెన్షన్ రూ. 4వేలు పెంచుతామని, ఎన్నికలు అయిపోయిన వెంటనే పెరిగిన పెన్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్‌దారులకు మద్దతుగా పోరాడేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శ్రీకారం చుడుతున్నారని, అందులో భాగంగా ఈ నెల 8న షాద్‌నగర్‌లో పెన్షన్‌దారుల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, గీత కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాఽసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు చిన్నోళ్ల అనంతయ్య, బుర్ర రాంచంద్రయ్య, రవికుమార్, ఆనంద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.