
తప్పని తిప్పలు యూరియా కోసం అవే పాట్లు
యూరియా కోసం అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. ఉదయం లేచింది మొదలు పీఏసీఎస్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. మహిళా రైతులు పనులు మాని స్లిప్పుల కోసం నిరీక్షిస్తున్నారు.పలుచోట్ల అధికారులతో వాగ్వాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసు పహారాలో పంపిణీ కొనసాగుతోంది.
షాబాద్: మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ఉదయాన్నే యూరియా కోసం రైతులు బారులు దీరారు. 400 బస్తాలు రాగా క్యూలో వేచిఉండి తీసుకెళ్లారు. రైతుకు రెండు బస్తాల చొప్పున అందజేశారు.
నీరసించి.. నిలదీసి
కేశంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతుందనే సమాచారంతో సోమ వారం ఉదయం రైతులు గ్రామ పంచాయతీ కార్యా లయం వద్దకు చేరుకున్నారు. స్లిప్పుల కోసం ఎగబడ్డారు. 450 బస్తాలు ఉండగా సుమారు 800 మంది రైతులు వచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్‌గౌడ్, మండల వ్యవసాయ అధికారి శిరీషను నిలదీశారు. పరిస్థితిని గ్రహించిన వారు ఫోన్‌లో జిల్లా వ్యవసాయాధికారికి విషయం తెలియజేశారు. త్వరలో మండలానికి సరపడా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఐ నరహరి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
ఇబ్రహీంపట్నం: వ్యవసాయ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతోనే యూరియా కోసం రైతులు అల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతు సంఘం జిల్లా అఽధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి విమర్శించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం రైతు సంఘం, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగును అంచనా వేసి, అందుకు అనుగుణంగా యూరియా తెప్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో రైతులకు ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యూరియ కొరత తీర్చి, బ్లాక్ విక్రయాలను అరికట్టకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, సీపీఐ మండల కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ వద్ద ఆందోళన
యాచారం: యూరియా కోసం సోమవారం పీఏసీఎస్ కార్యాలయానికి వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీరా రావడం లేదని తెలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న మండల వ్యవసాయాధికారి రవినాథ్ అక్కడికి చేరుకుని మంగళవారం రాత్రి వరకు వస్తుందని.. రాగానే సమాచారం ఇస్తాం, వచ్చి తీసుకెళ్లండని సూచించారు. అనంతరం రైతు వేదికలో రైతులతో సమావేశమై నానో యూరియాపై అవగాహన కల్పించారు.
షాబాద్: పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలో నిలబడి నిరీక్షిస్తున్న రైతులు