
మాల్‌ను సందర్శించిన ఉత్తరప్రదేశ్ బృందం
యాచారం: జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు దక్కించుకున్న మాల్ గ్రామ పంచాయతీని సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సందర్శించింది. పంచాయతీ స్వశక్తితో ఏ విధంగా ఆర్థిక బలోపేతం అయింది.. ఇంటి పన్నుల వసూలు.. పశువుల సంత వేలం పాట ద్వారా ఏటా వచ్చే ఆదాయం.. గ్రామంలో అభివృద్ధి పనుల తీరుపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఈజీఎస్ నర్సరీ, పల్లెప్రకృతి వనం, పశువుల సంత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో టీఎస్ ఐపార్డ్ అధికారులు అనిల్‌కుమార్, స్మిత, ఎంపీడీఓ రాధారాణి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, పంచాయతీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.