
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీతతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ఈ వారం మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యమైన ఆహారం అందించాలి
హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఆహారాన్ని తయారు చేసే చోట వంటగది శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ఈ నెల 6న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.