
పక్కాగా ఓటర్ల జాబితా
6న ముసాయిదా ప్రకటన..10న తుది లిస్టు వెల్లడి జిల్లాలో 21 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధం ‘సాక్షి’తో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఎన్నిక లు ఎప్పుడు వచ్చినా.. నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. పంచాయతీ ఎన్నికలు ఇతర గుర్తులపై నిర్వహిస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పార్టీ గుర్తులపై ఉంటుంది. కీలకమైన ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం’అని జెడ్పీ సీఈఓ సీహెచ్ కృష్ణారెడ్డి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన వెంటనే..
జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటి పరిధిలో 21 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 230 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. 2019 ఎన్నికల్లో 257 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కొత్తగా మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, గ్రేటర్ సమీపంలోని పలు గ్రామాలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో 27 ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. 558 పంచాయతీలకు 32 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన వెంటనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీలతో సమావేశం
526 పంచాయతీల పరిధిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముసాయిదా కూడా విడుదల చేసింది. ప్రతి ఎంపీటీసీ స్థానంలో కనీసం 3,500 ఓట్లు ఉండేలా జాబితా రూపొందించనున్నాం. ఈ నెల 6న ఓటర్ల జాబితాను ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రకటించనున్నాం. 8న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తాం. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి, పరిష్కరిస్తాం. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న వెల్లడిస్తాం. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల పరిధిలోనే రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండే అవకాశం ఉంది. మిగిలిన చోట రెండు మూడు గ్రామాలను కలిపే అవకాశం ఉంది.
బోగస్ ఓట్లకు ఆస్కారం లేకుండా..
ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వబోం. బోగస్ ఓట్లకు తావు లేకుండా పక్కాగా ఓటర్ల జాబితాను రూపొందిస్తాం. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఆయా పార్టీల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, అప్పటికప్పుడే వాటిని పరిష్కరిస్తాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. డివిజన్ల వారీగా జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ తర్వాతే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులను ముద్రించనున్నాం. ఇందుకోసం పది లక్షల బాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచాం.