వక్ఫ్‌ భూములు పరాధీనం | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూములు పరాధీనం

Aug 7 2025 10:36 AM | Updated on Aug 7 2025 10:36 AM

వక్ఫ్‌ భూములు పరాధీనం

వక్ఫ్‌ భూములు పరాధీనం

వికారాబాద్‌: వక్ఫ్‌ బోర్డు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మెజార్టీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ రెవెన్యూ పరిధిలో వక్ఫ్‌ భూములను పక్క పొలం రైతులు ఆక్రమించారని ఎర్రగడ్డపల్లికి చెందిన కొందరు కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్‌ఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. సమాధులను సైతం కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ భూములను గతంలో వక్ఫ్‌ బోర్డు అధికారులు పలుమార్లు సందర్శించారు. కబ్జాకు గురయ్యాయని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన ప్రతి సారీ వక్ఫ్‌ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపి కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 2,170 ఎకరాల వక్ఫ్‌ భూములు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండగా అవి చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. పొజిషన్‌లో మాత్రం వేరేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లి పోయాయి. కొన్ని చోట్ల సంరక్షకులుగా ఉన్న వారే యజమానులుగా మారిపోయారు. మరి కొన్ని చోట్ల కాగితాల్లో భూములు కనిపిస్తున్నాయి. పరాధీనం అయిన భూములపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక వేళ విచారణ జరిపినా నేతల ఒత్తిడి.. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు కారణంగా నివేదికలు బుట్టదాఖలు అవుతున్నాయి.

సర్వే చేయడంలో విఫలం

వక్ఫ్‌ భూములు ఉన్నదెంత.. ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనే దానిపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులకు అవగాహన ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇటు రెవెన్యూ.. అటూ వక్ఫ్‌ బోర్డు అధికారుల కనుసన్నల్లోనే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వక్ఫ్‌ భూములపై 1958 – 64 ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 2006లో మరోసారి సర్వే చేసినా ఆ వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సర్వే ప్రకారం వక్ఫ్‌ భూముల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రెండో విడత సర్వే చేసి ఉంటే..

రాష్ట్ర ప్రభుత్వం 2017 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెల్లడవుతాయని అందరూ భావించారు. కానీ మొదటి విడతలో కేవలం లిటిగేషన్‌ లేని భూములను మాత్రమే సర్వే చేశారు. రెండో విడత సర్వే చేసి ఉంటే వక్ఫ్‌ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

అనేక చోట్ల కబ్జా

● పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ శివారులో ఓ దర్గా సమీపంలో ఉన్న వక్ఫ్‌ బోర్డులు ఉన్నాయి. ఇందులో సుమారు ఐదెకరాల భూమి పరాదీనం అయ్యింది. గార్డియన్‌గా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వాటిని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయంలో స్థానకంగా నివాసముండే ఓ వ్యక్తి రెవెన్యూతో పాటు వక్ఫ్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి నివేఽధిక కూడా ఉన్నతాధికారులకు అందజేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతేడాది అధికారులు ఆ భూములను పరిశీలించి కబ్జాకు గురైనట్టు తేల్చారు, కాని ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వీటితో పాటు పరిగి మున్సిపల్‌ పరిధిలోని 568 సర్వే నెంబర్‌లో సుమారు 205 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యింది. పరిగి మండలం రాపోల్‌ గ్రామంలో వక్ఫ్‌ భూములు పరాధీనమయ్యాయి. ఇదే మండలం నారాయణ్‌పూర్‌లో 24 ఎకరాలు ఉండగా 22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్‌, ధారూరు, తాండూరు మండలాల్లో సైతం అన్యాక్రాంతం అయ్యాయి.

వికారాబాద్‌ జిల్లాలో 2,170 ఎకరాలు

ఆక్రమణలపై తరచూ కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదులు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, వక్ఫ్‌ బోర్డ్‌ అధికారులు

2006 సంవత్సరంలో సర్వే.. నేటికీ వెల్లడి కాని భూముల వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement