
ప్రైవేటుకు దీటుగా గురుకులాలు
తాండూరు టౌన్: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధన సాగుతోందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల (ట్రైస్) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ అన్నారు. బుధవారం తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠ శాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆన్‌లైన్ బోధనను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్‌తో పాటు ఆన్‌లైన్ తరగతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందన్నారు. ప్రతి ఏటా ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు గురుకులంలో బోధన, ఫలితాలు, వసతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోధన, వసతుల కల్పనలో మేటి
ట్రైస్ సెక్రటరీ రమణకుమార్
తాండూరులోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన