
మా సమస్యలు పరిష్కరించండి
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం తొర్రూర్‌లో హెచ్‌ఎండీఏ ద్వారా రూపొందించిన లే అవుట్‌లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ప్లాట్ల వేలాన్ని భూములు ఇచ్చిన రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వేలం వేయడంపై అభ్యంతరం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్‌లోని సర్వే నంబర్ 383/1లో సుమారు 117 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి హెచ్‌ఎండీఏ అధికారులు సేకరించారు. పొజీషన్‌లో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి 300 గజాల ఇంటి స్థలాన్ని అదే లే అవుట్‌లో ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు అలాట్‌మెంట్ పత్రాలు జారీ చేశారు. అనంతరం కొన్ని ప్లాట్లను వేలం వేశారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ స్థలాలపై పూర్తి హక్కుల కల్పించాలని రైతులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నుంచి అధికారం పొందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 510 ప్లాట్లలో 100 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని ఓ కన్వెన్షన్ హాలులో వేలం వేసేందుకు బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ నరేందర్‌రెడ్డి వచ్చారు. బహిరంగ వేలం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు వేలం పాటకు అడ్డు తగాలారు. పోలీసులు కలుగ జేసుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని అక్కడికి పంపించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, 10–15 రోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని అడ్డుకున్న రైతులు
అడిషనల్ కలెక్టర్ హామీతో శాంతించిన వైనం