
కుర్మిద్దలో ‘మార్‌బని’
యాచారం: కుర్మిద్దలో జపాన్‌కు చెందిన మార్‌బని అనే కంపెనీకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి యాచారం మండల పరిధిలోని కుర్మిద్దలో 426.32 ఎకరాలు, కందుకూరు మండలం మీరాఖాన్‌పేటలో 546.10 ఎకరాలు కేటాయిస్తున్నారు. కుర్మిద్ద గ్రామంలోని సర్వేనంబర్ 311, 312తో పాటు 290, 291, 294, 295, 296, 297, మీరాఖాన్‌పేట పరిధిలోని సర్వే నంబర్ 113, 114, 118లో దాదాపు వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సర్కార్ సదరు కంపెనీకి ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
మొదట్లో ససేమిరా.. తర్వాత అంగీకారం
మార్‌బని కంపెనీకి కుర్మిద్దలోని సర్వేనంబర్ 290 నుంచి 297 వరకున్న పట్టా భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అన్నారు. సర్కార్ నిర్మించడానికి నిర్ణయించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పక్కనే ఈ భూ ములు ఉండడంతో మొదట్లో ఆగ్రహం వ్యక్తమైంది. మెరుగైన పరిహారంతోపాటు 121 గజాల ప్లాటు ఆఫర్‌తో మెత్తబడ్డారు. పట్టా భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో రెవెన్యూ అధికారులు దాదాపు 50 ఎకరాలకు పైగా సేకరించారు. టీజీఐఐసీ ద్వారా రూ.30 లక్షలు, మార్‌బని కంపెనీ నుంచి రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇప్పించారు. కంపెనీకి కేటాయించడానికి ఇంకా పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు రైతులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.
మొండిగౌరెల్లిలో అభిప్రాయసేకరణ
మొండిగౌరెల్లిలోని 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు మూడు నెలల క్రితం సర్కార్ నోటిఫికేషన్ ప్రకటించింది. గ్రామంలోని సర్వేనంబర్ 19, 68, 127 అసైన్డ్ నంబర్లతో పాటు పలు పట్టా సర్వేనంబర్లలో ఉన్న భూములను కూడా నోటిఫికేషన్‌లో పొందుపర్చింది. పారిశ్రామిక పార్క్ కోసమంటూ ప్రకటించింది. ఏ కంపెనీలకు ఆ భూములను కేటాయిస్తుందో మాత్రం నేటికీ ప్రకటించలేదు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి గ్రామంలోని అసైన్డ్, పట్టా భూములను పరిశీలించి భూసేకరణపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భూములిచ్చే విషయంలో మిశ్రమ స్పందన రావడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఢిపెన్స్‌కు అసైన్డ్ భూములు!
మొండిగౌరెల్లిలో అత్యధికంగా రైతులు పుదీన, ఆకుకూరలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ గ్రామాన్ని కూరగాయలు, ఆకుకూరల పెంపు కోసం దత్తత తీసుకుంది. గ్రామ రైతులు కూడా రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పట్టా భూములతో పాటు, వెంచర్ ద్వారా ప్లాట్లు చేసిన భూమిని మినహాయించాలని కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు రైతు కమిషన్ చైర్మన్ సూచించారు. తాజాగా ఆ గ్రామ భూములు డిఫెన్స్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డిని సంప్రదించగా కుర్మిద్దలోని వెయ్యి ఎకరాలను మార్‌బని కంపెనీకి సర్కార్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు.
జపాన్‌కు చెందిన కంపెనీ ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు కేటాయింపు
ఎకారకు రూ.45 లక్షల చొప్పున పట్టా రైతులకు పరిహారం
మీరాఖాన్‌పేట టీజీఐఐసీ వెంచర్‌లో 121 గజాల ప్లాటు
మొండిగౌరెల్లి అసైన్డ్ భూములు ఢిపెన్స్‌కు ఇచ్చే ఆలోచన