
దళితవాడకు అడ్డు కంచె తొలగింపు
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో నెలకొన్న దళితవాడకు అడ్డంగా కంచె వివాదం సద్దుమణిగింది. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా దారిని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటుపై మంగళవారం దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, టీఎమ్మార్పీఎస్, ధర్మసమాజ్‌పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్డుగా వేసిన కంచెను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకోసం ఇచ్చిన స్థలంలో కంచె వేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కంచె ఏర్పాటు చేశారని ఆరోపించారు. కంచె ఏర్పాటుతో దళితులు తమ ఇళ్లకు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. కంచె ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందంటే తొలగిస్తామని బూర్గుల నర్సింగ్‌రావు సోదరి సుమన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, వివిధ సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనునాయక్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
స్మృతివనం ఏర్పాటు చేస్తాం
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్‌రావు గ్రామ అవసరాలకు ఇచ్చిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆయన సోదరి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బూర్గుల సుమన వెల్లడించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె గ్రామస్తులు, దళితులతో మాట్లాడారు. దళితులు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామానికి ఇచ్చిన స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఆ స్థలంలో బూర్గుల నర్సింగ్‌రావు ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని, ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారని చెప్పారు. ఏ రోజూ తాము ఆ స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే ఆలోచన చేయలేదన్నారు. స్మృతివనం ఏర్పాటుచేస్తే మొక్కలను పశువులు మేస్తాయనే ఆలోచతో కంచె వేశామే తప్ప ఆక్రమించుకునేందుకు కాదని స్పష్టం చేశారు.
సద్దుమణిగిన వివాదం