
బాలుడు అదృశ్యం
కొందుర్గు: బాలుడు అదృశ్యమైన ఘటన కొందర్గు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన దర్గ చందు(15) స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ కొందుర్గు జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 31న పాఠశాలకు మూడు రోజులు సెలవులున్నాయని కుటుంబ సభ్యులకు అబద్దపు సమాచారం ఇచ్చి స్వగ్రామానికి వచ్చాడు. అనుమానం వచ్చిన బాలుడి తండ్రి నర్సింలు ఈ నెల 2న పాఠశాల ఉన్నప్పటకీ ఇంటికి ఎందుకు వచ్చావని మందలించాడు. ఈ నెల 3న హాస్టల్‌కు వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. తండ్రి మంగళవారం హాస్టల్‌కు వెళ్లగా సిబ్బంది రాలేదని చెప్పా రు. నర్సింలు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఎటువంటి ఆచూకీ లభించక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొండాపూర్‌లో అక్రమ బ్లాస్టింగ్
పాఠశాలలో పడ్డ బండరాళ్లు
గచ్చిబౌలి: కొండాపూర్‌లో నిబంధనలకు వి రుద్ధంగా చేపట్టిన బ్లాస్టింగ్‌తో పక్కన్నే ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బండ రాళ్లు పడటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాళ్లు పడ్డ ప్రాంతంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్‌లో ఓ రియల్‌ఎస్టేట్ సంస్థ సైట్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బండ రాళ్లు పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ చేపట్టారు. కాంట్రాక్టర్ కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకపోవడంతో సైట్‌ను ఆనుకొని ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఎగిరి బండ రాళ్లు పడ్డాయి. ఆ సమయంలో కొంత మంది విద్యార్థులు ఆటలు ఆడుకుంటుండగా మరికొంత మంది లంచ్ బ్రేక్ కావడంతో ఆవరణలో ఉన్నారు. బండరాళ్లు ఉవ్వెత్తున దూసుకురావడంతో విద్యార్థులు ఆందోళనతో తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు స్కూల్‌లో పడ్డాయని వైస్ ప్రిన్సిపాల్ రంజిత్ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.