
కబ్జా కోరల్లో ఫిరంగి నాలా
శంషాబాద్: ఫిరంగి నాలా కబ్జాదారులకు కాసులవర్షం కురిపిస్తోంది. నాలా పక్కల భూములు కొన్న యజమానులు నాలాను సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారికి అత్యంత సమీపంలోనే అక్రమాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కబ్జాదారుల కబంద హస్తాల్లో చిక్కి ఉనికి కోల్పోతున్న నాలాను పరిరక్షించడంలో ఇరిగేషన్ అధికారులు అనురసరిస్తున్న నిర్లక్ష్యం వీరికి వరంగా మారుతోంది.
శంషాబాద్ పట్టణంలో...
శంషాబాద్ పట్టణంలో జాతీయ రహదారికి పక్కనే ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిని ఆనుకున్న సర్వే నంబర్లు 182, 275 మధ్యలో ఫిరంగి నాలా ఉంది. ఇది పూర్తిగా చదునుగా ఉండటంతో నాలా ఉందనే విషయం కూడా కనిపించని పరిస్థితి. ఇటీవల ఇక్కడ భూములు కొనుగోలు చేసిన కొందరు యజమానులు నాలాకు రెండు వైపుల భూములు తమవే ఉండటంతో చుట్టూ ప్రీకాస్ట్‌తో ప్రహరీని నిర్మించారు. మధ్యలో ఉన్న నాలాను పూర్తిగా తవ్వించాలని ఇటీవల స్థానికులు ఇరిగేషన్ అధికారులకు విన్నవించారు.
నాలాను తవ్వితేనే
ఏడాదిన్నర క్రితం ఇక్కడే కొందరు కార్పొరేట్ స్థాయి బడాబాబులు ఏకంగా నాలాకు ఇరువైపుల ఉన్న గోడను సైతం తొలగించి మట్టితో చదును చేశారు. పదిహేను ఎకరాలకు పైగా ఇక్కడ నాలాకు ఇరువైపు కొందరు రియల్టర్లు భూములు కొనుగోలు చేశారు. భూమి చదునుగా ఉండటంతో నాలాను అమాంతం తమ భూముల్లోకి కలుపుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై ఇరిగేషన్ అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని నాలా వెడల్పుతో పాటు పొడవును పునరుద్ధరిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
అధికారుల అలసత్వంతోనే..
అధికారుల అలసత్వం కారణంగానే పట్టణంలో ఫిరంగి నాలా ఆక్రమణలకు గురవుతోంది. ప్రీకాస్ట్ తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. ఇరిగేషన్ మ్యాపులో ఉన్న విధంగా నాలాను పునరుద్ధరించి బఫర్ జోన్ వరకు హద్దులు ఏర్పాటు చేస్తే నాలా పరిరక్షణ సాధ్యమవుతుంది. ఎయిర్‌పోర్టు రహదారి పక్కనున్న నాలాను అక్కమార్కులు తరచు తమ కబ్జాల్లోకి తీసుకుంటున్నారు.
– మురళి, శంషాబాద్
చర్యలు తీసుకుంటాం
నాలా పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి చేయాల్సి ఉంటుంది. మధ్యలో నాలా ఉండి చుట్టుపక్కల నిర్మాణాలు చేపడితే తొలగిస్తున్నాం. ఇటీవల ప్రీకాస్ట్ వేసిన వాటిని కూడా తీయించాల్సిందిగా ఆదేశించాం. శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటాం.
– మౌనిక, ఏఈ, ఇరిగేషన్
మధ్యలో చుట్టూప్రహరీల నిర్మాణం
తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్న ఇరిగేషన్ అధికారులు
కాలువను పునరుద్ధరించకపోవడంతో కబ్జాలకు ఊతం

కబ్జా కోరల్లో ఫిరంగి నాలా