
వికలాంగుల పింఛన్ పెంచాలి
యాచారం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వికలాంగుల పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. యాచారం మండలం గునుగల్ గ్రామంలో సోమవారం సమితి మండల అధ్యక్షుడు మహేశ్ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్, ఎంఎస్సీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలని కోరారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి, ఎంతో మంది పేదలకు న్యాయం చేశామని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, హామీ ప్రకారం పింఛన్ డబ్బులు పెంచాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్లు లేక అర్హులైన వికలాంగులకు పింఛన్ మంజూరు కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు జంగయ్య, వెంకటేశ్, వై.జంగయ్య, సతీష్, సుధాకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్