పహాడీషరీఫ్: జల్‌పల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా అక్రమ షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 100 గజాల నుంచి 1,000 గజాల వరకు గుట్టు చప్పుడు కాకుండా షెడ్ల నిర్మాణాలు చేపట్టి అక్రమ వ్యాపారాలకు తెర తీస్తున్నారు. భారీ ప్రహరీలు, షెడ్ల నిర్మాణంతో పాటు అందులో నడిపే వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. కానీ కొందరు కిందిస్థాయి సిబ్బంది వ్యాపారులతో కుమ్మకై మామూళ్లు తీసుకొని వీరికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయం సమీపం నుంచి మొదలుకొని శ్రీరాం కాలనీ, కార్గో రోడ్డు పరిసరాలలో ఇలాంటి నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కనీసం ప్రమాణాలు కూడా పాటించకుండా ఏర్పాట్లు చేస్తున్న ఈ రేకుల షెడ్లతో ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు త్వరగా మంటలను కూడా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయంలో మున్సిపాలిటీ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.