
సాగు చట్టాలపై అవగాహన అవసరం
రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్
చేవెళ్ల/మొయినాబాద్: భూ హక్కులు, సాగు చట్టాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్ అన్నారు. రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో లీప్ సంస్థ సహకారంతో చేపడుతున్న ‘సాగు న్యాయ యాత్రశ్రీలో భాగంగా శుక్రవారం మొయినాబాద్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సాగు భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా భూ భారతిలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులతో నష్టపోతే చట్టాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మార్కెట్ అన్యాయాలు, పంటల బీమా సమస్యల పరిష్కారానికి న్యాయ సలహాలు తీసుకోవచ్చన్నారు. రైతులకు న్యాయ సహాయం అందించేందుకే శ్రీసాగు న్యాయ యాత్ర’ చేపడుతున్నట్టు చెప్పారు. అనంతరం చిన్నషాపూర్‌లో కూరగాయ పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రైతు సంక్షేమ కమిషన్ ఓఎస్‌డీ హరివెంకటప్రసాద్, శ్రావణి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, చేవెళ్ల ఏడీఏ సురేష్‌బాబు, ఏఓ అనురాధ, ఏఈఓలు సునీల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు చట్టాల గురించి తెలుసుకోవాలి
రైతులకోసం పనిచేసే చట్టాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతు సాగు న్యాయ యాత్ర కార్యక్రమంలో భాగంగా భూమి సునీల్ సారథ్యంలోని లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు భూ భారతి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సాగు యాత్రతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సునీల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై ప్రతి రైతుకీ అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో భూదాన్ మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్, మార్కెట్‌కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, టీపీసీసీ నాయకులు పాల్గొన్నారు.