
040–23237416
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఇంకా 48 గంటలు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చేసిన సూచన మేరకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడైనా వరదలు సంభవించినప్పుడు ప్రజలకు సహాయ, సహకారాలు అందించడానికి కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో, బాధితులు సహాయం కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్: 040–23237416కు కాల్ చేయొచ్చని, వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి సహాయం అందిస్తుందని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు పనిచేస్తుందన్నారు.
నేడు రేషన్‌కార్డుల పంపిణీ
హాజరుకానున్న మంత్రి శ్రీధర్‌బాబు
అబ్దుల్లాపూర్‌మెట్: రెవెన్యూ మండల పరిధిలో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను శనివారం ఐటీ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌రాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని తారా కన్వెన్షన్ హాల్‌లో మధ్యా హ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి లబ్ధిదారుల హాజరు కావాలని సూచించారు.
ఆయిల్‌పామ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
మాడ్గుల: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆయిల్‌పాం సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సీజన్‌లో వరి వేస్తే మరో సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఆయిల్‌పాం సాగులో మూడేళ్ల పాటు కష్టపడితే 30 సంవత్సరాల వరకు నికర ఆదాయం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీపీడీ నీరజ్ గాంధీ, మండల వ్యవసాయాధికారి అరుణకుమారి, విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.
చటాన్‌పల్లి వద్ద
ఫ్లైఓవర్‌కు గ్రీన్‌సిగ్నల్
షాద్‌నగర్: పట్టణంలోని చటాన్‌పల్లి వద్ద ఉన్న రైల్వే గేటుపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్ర వారం ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు, నాయకులు పరిశీలించారు. రూ.184 కోట్లు వెచ్చించి వై ఆకారంలో ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఏఈ రవీందర్, కాంట్రాక్టర్లు సందీప్‌కుమార్, టీవీరావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇక చచ్చినా పార్టీ మారను
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
మొయినాబాద్: అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయొచ్చని గతంలో పార్టీలు మారాను.. బీజేపీలో చేరినప్పుడు మళ్లీ ఎప్పుడు మారుతాడోనని చాలామంది మాట్లాడుకున్నారు.. ఇక చచ్చినా మారను.. కడదాకా బీజేపీలోనే ఉంటానని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మొయినాబాద్‌లోని పద్మావతి గార్డెన్‌లో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ మండల కార్యకర్తల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్‌కుమార్‌గౌడ్, కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.

040–23237416