శ్రీరస్తు.. శుభమస్తు | - | Sakshi
Sakshi News home page

శ్రీరస్తు.. శుభమస్తు

Jul 26 2025 10:02 AM | Updated on Jul 26 2025 10:02 AM

శ్రీర

శ్రీరస్తు.. శుభమస్తు

షాద్‌నగర్‌ః శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అన్నట్లు శ్రావణమాసం రాకతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి.

మంచి ముహూర్తాలు

మూఢంతో గత మే 24 నుంచి శుభముహూర్తాలు లేవు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అంతా దూరంగా ఉన్నారు. శ్రావణ మాసం ప్రారంభంతో ఆగిపోయిన శుభకార్యాలు మళ్లీ మొదలయ్యాయి. ఈనెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 10, 13, 15, 17, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత వచ్చే ఆశ్వయుజ, కార్తీక మాసాలు శుభకార్యాలకు శ్రేష్టమైనవి. అంటే అక్టోబర్‌ 4, 8, 16, 24, 31, నవంబర్‌ 1, 7, 22, 23, 25, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. శుభముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా వందలాది జంటలు ఒక్కటి కానున్నాయి.

వ్యాపారాల జోరు

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో అనుబంధంగా ఉండే వ్యాపారాలు జోరందుకోనున్నాయి. పురోహితులే ముహూర్తాలు ఖరారు చేయనుండడంతో ముఖ్య మైన రోజుల్లో వారు బిజీగా మారారు. ఇప్పటికే పురోహితులు, ఈవెంట్లు, పెళ్లి పత్రికల ముద్రణ, మండపాలు, క్యాటరింగ్‌, బాజా, సన్నాయిమేళాలు, డెకరేషన్‌, డీజే, టెంట్‌హౌస్‌ నిర్వాహకులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. రెండు, మూడు నెలల మందే బుకింగ్‌ చేసుకుంటున్నారు.

బంగారం ధరలతో బెంబేలు

బంగారం పేరు వింటేనే గుండె గుబిల్లుమంటోంది. సామాన్యులకు అందనంత దూరంలో ధర పెరుగుతూ వెళ్తోంది. శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉండడంతో పసిడి మరింత ప్రియం కానుందని వ్యాపారులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి. వివాహాల్లో ఆభరణాలు తప్పనిసరి కావడంతో కొనుగోలు తప్పడం లేదని పలువురు అంటున్నారు.

ప్రారంభమైన శుభ ముహూర్తాలు

ఒక్కటి కానున్న వందలాది జంటలు

అనుబంధ వ్యాపారులకు డిమాండ్‌

పెరుగుతున్న ఖర్చులు

కలకాలం నిలిచిపోయే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కొందరు పెళ్లిళ్ల కోసం ఈవెంట్‌ ఆర్గనైజర్లను ఆశ్రయిస్తున్నారు. అందరూ మెచ్చేలా.. గుర్తుంచుకునేలా వేడుకను నిర్వహించాలని ఫంక్షన్‌ హాళ్లలో ఆర్భాటంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసే మండపం, భోజనాలు, బ్యాండ్‌, వచ్చిపోయే బంధువులకు మర్యాదలు, ఫొటోలు, వీడియోలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

శుభకార్యాల మాసం

శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఎన్నో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. మంచి ముహూర్తానికి ఎక్కువ మంది పెళ్లిళ్లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వేదమంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి.

– రవిశర్మ, పురోహితుడు, షాద్‌నగర్‌

శ్రీరస్తు.. శుభమస్తు1
1/1

శ్రీరస్తు.. శుభమస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement