ఊరు.. పట్టించుకోరు! | - | Sakshi
Sakshi News home page

ఊరు.. పట్టించుకోరు!

Jul 26 2025 10:02 AM | Updated on Jul 26 2025 10:02 AM

ఊరు..

ఊరు.. పట్టించుకోరు!

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఏ వీధిలోకి తొంగి చూసినా చెత్త గుట్టలే దర్శనమిస్తున్నా యి. చెత్తను తరలించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీలు ఏర్పాటు చేసినప్పటికీ డీజిల్‌ ఖర్చులకు నిధులు మంజూరు చేయకపోవడంతో కార్యదర్శులు, గ్రామస్తులు కలిసి చందాలు వేసుకుని పని చేయించాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తగా డ్రైనేజీ కాల్వలు నిర్మించకపోవడంతో ఏకధాటి వర్షాలకు ఇళ్ల మధ్యే డ్రైనేజీ పొంగి ప్రవహిస్తోంది. రోజుల తరబడి ఫాగింగ్‌ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాడైపోయిన వీధిదీపాలను మార్చకపోవడంతో కాలనీల్లో అంధకారం అలముకుంటోంది. విషకీటకాల భయంతో పల్లెవాసులు రాత్రిపూట కాలు బయట పెట్టేందుకే జంకుతున్నారు.

గుంతలు తేలిన మట్టి రోడ్లే దిక్కు

జిల్లాలో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో 1,166.629 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తీర్ణం ఉంది. దీనిలో 66.50 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, 706.365 కిలోమీటర్ల జిల్లా ప్రధాన రహదారులు, 393.714 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ విభాగం ఆధ్వర్యంలో 3,731.92 కిలోమీటర్ల రోడ్లు ఉండగా, వీటిలో 234 కిలోమీటర్ల సీసీ రోడ్డు, 1,678 కిలోమీటర్ల తారు రోడ్లు, 334 కిలోమీటర్ల కంకర రోడ్లు, 578 కిలోమీటర్ల మొరం రోడ్లు, 908 కిలో మీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయి. వర్షాలకు తోడు భారీ వాహనాల రాకపో కలతో మెజార్టీ రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలను పూడ్చకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతు న్నాయి. మెజార్టీ గ్రామీణ ప్రజలు కంకర, మొరం, మట్టి రోడ్లపైనే ప్రయాణం సాగిస్తున్నారు.

ఇళ్ల మధ్య మురుగు పరుగు

గ్రామీణ ప్రాంతాల్లో 210.71 కిలోమీటర్ల ఓపెన్‌ డ్రైనేజీ కాల్వలు ఉండగా, 1,320.19 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ విస్తరించి ఉంది. గ్రామ శివారు ప్రాంతాల్లోని మెజార్టీ కాలనీల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. కచ్చ కాల్వలే దిక్కవుతున్నాయి. ఈ కాల్వల విస్తీర్ణం 192.04 కిలోమీటర్లు ఉన్నట్లు అంచనా. వీధుల్లో మురుగునీరు పారుతోంది. ఏకధాటి వర్షాలు, వరదలకు ఇంటి ముందు నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలకు నిలయంగా మారుతున్నాయి.

డీజిల్‌ ఖర్చులకు దిక్కులేదు

జిల్లావ్యాప్తంగా 236 వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు సహా 259 డంపింగ్‌ యార్డ్‌లు, 493 వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలు ఉన్నట్లు అంచనా. నిర్వహణ లోపంతో వీటిలో మెజార్టీ కేంద్రాలు పని చేయడం లేదు. వీధుల్లో చెత్తను తరలించేందుకు 555 ట్రాక్టర్లు, 1,073 ట్రాలీలు, 549 ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. జీపీల వద్ద డీజిల్‌ ఖర్చులకు నిధులు లేక కార్యదర్శులు అప్పులు చేయాల్సి వచ్చింది. మంచినీటి బోర్ల రిపేర్లకూ ఇబ్బందులు తప్పడం లేదు. 53 కమ్యూనిటీ టాయ్‌లెట్స్‌, 28 షీ టాయ్‌లెట్లను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వైకుంఠధామాలు నిరుపయోగంగా మారాయి. వర్మీ కంపోస్టు కేంద్రాలు పూర్తిగా పని చేయడం లేదు.

పిచ్చి మొక్కలతో క్రీడా ప్రాంగణాలు

జిల్లా వ్యాప్తంగా 1,267 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వాటి ముందు కేవలం బోర్డులు పెట్టి వదిలేశారు. ఊరికి దూరంగా, నిర్వహణ లోపంతో అవి పిచ్చి మొక్కలకు నిలయంగా మారాయి. 766 పల్లె ప్రకృతి వనాలు, 52 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, 536 నర్సరీలు ఉన్నాయి. వేసవిలో నీళ్లు పోయకపోవడంతో మెజార్టీ మొక్కలు చనిపోయాయి. రక్షణ లేక ఏపుగా పెరగాల్సిన మొక్కలు విరిగిపోయి కన్పిస్తున్నాయి.

పల్లెలు సమస్యల లోగిళ్లలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నాయి. పాలకమండళ్లు రద్దై ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటి వరకు కొత్తవి ఏర్పాటు కాకపోవడం, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాల ముఖం చూడకపోవడం, ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

పడకేసిన పల్లెలు

అస్తవ్యస్తంగా మురుగునీటి పారుదల వ్యవస్థ

గుంతలు తేలిన రహదారులు

పేరుకుపోయిన చెత్తకుప్పలు

లోపించిన పారిశుద్ధ్యం

దృష్టిసారించని ప్రత్యేకాధికారులు

జిల్లాలోని పల్లెల స్వరూపం

మండలాలు 27

జెడ్పీటీసీలు 21

ఎంపీటీసీలు 230

పంచాయతీలు 526

మొత్తం ఓటర్లు 7,94,653

ఊరు.. పట్టించుకోరు! 1
1/3

ఊరు.. పట్టించుకోరు!

ఊరు.. పట్టించుకోరు! 2
2/3

ఊరు.. పట్టించుకోరు!

ఊరు.. పట్టించుకోరు! 3
3/3

ఊరు.. పట్టించుకోరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement