
ఉండలేం.. వచ్చేస్తాం!
జైళ్లను తలపిస్తున్న కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కార్పొరేట్ జూనియర్ కాలేజీ వసతి గృహాలు చెరసాలలను తలపిస్తున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు.. విరామం లేకుండా తరగతులు నిర్వహిస్తుండటం.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సమయం లేకపోతుండటంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఉండలేం.. వచ్చేస్తామంటూ బోరుమంటున్నారు. ఇంటర్మీడియెట్‌లో మెరుగైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో ర్యాంకుల సాధన కోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్‌కాలేజీ వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు. పిల్లల శక్తిసామర్థ్యాలు, ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా చేర్పిస్తుండటంతో చేరిన కొద్ది రోజులకే అక్కడ తాము చదవలేమని.. తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోవాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఏమీ తినకుండా కడుపుమాడ్చుకుని నీరసంతో ఆస్పత్రుల్లో చేరుతుండగా.. మరికొంత మంది ఏకంగా బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటికే సగానికిపైగా ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు చేసేది లేక.. పిల్లలకు సర్దిచెబుతున్నారు.
ఉదయం నుంచే ఉరుకులు పరుగులు
జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 214 ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో రెండు వేల నుంచి మూడు వేల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కో గదిలో ఆరు నుంచి ఎనిమిది మందిని ఉంచుతున్నారు. వీరందరికీ ఒక్కటే మూత్రశాల, మరుగుదొడ్డి, స్నానాల గది ఉండటంతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి బాత్‌రూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇంటర్మీడియెట్ సబ్జెక్టును త్వరగా పూర్తి చేసి, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతలు నిర్వహిస్తుంటారు. నిత్యం ఉద యం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు క్లాసులు జరుగుతుంటాయి. అల్పాహారం..మధ్యాహ్న భోజనం కోసం గంటన్నర మినహా ఇతర సమయంలో విరామం అంటూ లేకుండా పోతోంది. రాత్రి 11 తర్వాతే నిద్రపోవాల్సి వస్తోంది. కంటికి కునుకులేక, క్లాసులో లెక్చరర్ చెప్పింది అర్థం కాక, భోజనం నాసీరకంగా ఉండటంతో తరచూ అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
చిన్నతనంలోనే పెద్ద జబ్బులు
సాధారణంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు కనీస వ్యాయామం అవసరం. కానీ వసతి గృహాల్లో చదువుకుంటున్న వారికి ఆ సమయమే దొరకడం లేదు. చాలామంది పిల్లలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రోజుకు పదహారు గంటల పాటు కూర్చోవాల్సి వస్తుండటం, కంటికి నిద్రలేకపోవడం, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో చిన్నతనంలోనే ఒత్తిడికి గురవడంతోపాటు ఊబకాయులుగా మారుతున్నారు. నిజానికి ప్రతి కాలేజీలో మానసిక నిపుణులను నియమించాల్సిఉన్నా.. ఎక్కడా పాటించడం లేదు. కౌన్సెలింగ్ నిర్వహించే వాళ్లు లేకపోవడంతో ప్రతి చిన్న విషయానికి మానసికంగా కుంగిపోతూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
అద్దెభవనాలు.. అరకొర వసతులు
మెజార్టీ కాలేజీలు అపార్ట్‌మెంట్లలోనే కొనసాగుతున్నాయి. కనీసం ఫైర్‌సేఫ్టీ కూడా లేని బహుళ అంతస్తుల భవనాలను అద్దెకు తీసుకుని వసతితో పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. నిజానికి వీటిలో తరగతుల నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. వసతి గృహాల నిర్వహణకు అనుమతులు లేవు. అయినా ఆయా భవనాల్లో తాత్కాలికంగా చిన్నచిన్న గదులను ఏర్పాటు చేసి ఒక్కో గదిలో ఎక్కువ మంది విద్యార్థులను కుక్కేస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. కార్పొరేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పరోక్షంగా వాటికి కొమ్ముకాస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కరువైన మౌలిక వసతులు
విరామం లేకుండా తరగతులు
ఒత్తిడి తట్టుకోలేకపోతున్న విద్యార్థులు
ఇళ్లకు వచ్చేస్తామంటూ తల్లిదండ్రులకు వేడుకోలు
కొరవడిన ప్రభుత్వ నియంత్రణ
అలవాటుపడలేక..
అప్పటి వరకు సాధారణ పాఠశాలలో చదువుకున్న పిల్లలను ఒకేసారి కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో చేర్పించడంతో ఆ వాతావరణానికి ఇబ్బంది పడుతున్నారు. విరామం లేకుండా తరగతుల నిర్వహణతో మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులతో పాటు లెక్చరర్లు అర్థం చేసుకోవాలి. వారికి నచ్చజెప్పి ఇష్టంగా చదివే విధంగా తయారు చేయాలి.
– డాక్టర్ నాగేందర్, మహేశ్వరం మెడికల్ కాలేజీ

ఉండలేం.. వచ్చేస్తాం!