
అడ్డగోలు బాదుడు!
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను ఆశ్రయించాడు. సాధారణంగా క్షణాల్లో బుక్ అయిపోయే సమయా నికి అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్ సంస్థకు చెందిన క్యాబ్ బుక్ అయింది. ఆన్‌లైన్ యాప్‌లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. గత్యంతరం లేక ఎక్కువ చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్‌ల నిర్వహణలో స్లాక్ (రద్దీ లేని), పీక్ (రద్దీ ఉన్న) సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. క్యాబ్ అగ్రిగేటర్‌లు ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచకుండా అరికట్టేందుకు నియంత్రణ చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ రవాణా శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో చార్జీలపైన నియంత్రణ కొరవడింది.
ఆన్‌లైన్‌లోనే బేరసారాలు
కొన్ని అగ్రిగేటర్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్‌కు చెందిన ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎంపిక చేసుకున్న చార్జీలకు డ్రైవర్ సుముఖంగా లేడంటూ ఐదు నిమిషాల తర్వాత మొబైల్ స్క్రీన్‌పై కనిపించింది. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. చివరికి రూ.50 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీ ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి.
● కొన్ని అగ్రిగేటర్ సంస్థలకు చెందిన యాప్‌లలో ఈ ఆప్షన్ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్‌లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్ బుక్ అయిన తర్వాత ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు.
ఆటోలు, క్యాబ్‌లకు అనూహ్యంగా డిమాండ్
ఇష్టారాజ్యంగా పెంచేసిన చార్జీలు
మెట్రో రైళ్లలోనూ విపరీతమైన రద్దీ
మెట్రోల్లో పెరిగిన రద్దీ
వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్– మియాపూర్ కారిడార్‌లలో సాయంత్రం పలు మెట్రో స్టేషన్‌లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.