
హైవేపై ట్రా‘ఫికర్’
నిత్యం వేలాది వాహనాలు కొత్తగా రోడ్డుపైకి వస్తున్నాయి. కానీ అందుకు తగిన రహదారి విస్తరణ, ట్రాఫిక్, వేగ నియంత్రణ చర్యలు సరిగా లేవు. దీనికి తోడు ఫుట్‌పాత్ ఆక్రమణలు. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలుఉత్పన్నమవుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
కడ్తాల్: మండల కేంద్రం మీదుగా శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకోపోకలు సాగిస్తుంటాయి. రహదారికి ఇరువైపులా రోడ్డుపైనే చిరువ్యాపారులు జీవనోపాధి పొందుతుంటారు. ఇక ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రోడ్డుపై నిలుపుతుండటంతో పాదచారులు, ప్రయాణికులతో పాటు వాహనదారులూ ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై డివైడర్ ఏర్పాటు చేసి. నాలుగు వరుసలుగా రోడ్డును నిర్మించారు. దీంతో రోడ్డు వాహనాల పరుగులతో రద్దీగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాల పార్కింగ్‌కు ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాలినడక ఏరియాలో చిరువ్యాపారులు దుకాణాలు కొనసాగిస్తుండటంతో వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్డుపై తమ వాహనాలకు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాం అవుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై.. కొందరు షెడ్లు నిర్మించుకొని దుకాణాలు కొనసాగిస్తుండటంతో పాదచారులకు ఇబ్బంది తప్పడంలేదు.
రోడ్డుపైనే ఆర్టీసీ బస్సులు
రోడ్డుపైనే వాహనదారులు వారి వాహనాలను ఇష్టానుసారంగా నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. బస్టాండ్ లేక పోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డుపైనే ఆగుతున్నాయని, దీంతో వెనకాల వచ్చే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా దుకాణ సముదాయాలు, హోటల్స్ ఉండటంతో కొనుగోలుదారులు తమ బైక్‌లను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో పరుగులు తీసే శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై.. వాహనాలు నిలపకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకొని, ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు శూన్యం
శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల పార్కింగ్
ఫుట్‌పాత్ ఏరియాలో చిరువ్యాపారాలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, పాదచారులు