
‘చలో గన్‌పార్క్’కుతరలిరండి
చేవెళ్ల: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని నిర్వహిస్తున్న చలో గన్ పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి యాలాల మహేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం చేవెళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 22న ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చల్ గన్‌పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్‌లో ఉద్యమ అమరుడు యాదిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
కుక్కల దాడిలో మేకల మృతి
కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో నాలుగు మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురువ మల్లేశ్ మేకల పోషణతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగా మేకలను శనివారం రాత్రి తన వ్యవసాయ పొలంలోని కొట్టాంలో ఉంచి ఇంటికి మల్లేశ్ వెళ్లాడు. మరుసటి రోజు ఆదివారం ఉదయం మంద వద్దకు వెళ్లి చూడగా కుక్కలు దాడి చేసి నాలుగు మేకలను చంపేసినట్లు గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. మేకల విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.
పాఠశాలకు బెంచీల వితరణ
కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌లోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలను ఆదివారం అందించారు. సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్స్ చారిటబుల్ ట్రస్ట్ బెంచీమార్క్ త్రీ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాలకు చైర్మన్ నాగశ్రీధర్ 40 బెంచీలను అందజేశారు. విద్యాభివృద్ధికి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ మాజీ చైర్మన్ కమలాకర్ ముత్యాలు, ప్రధానోపాధ్యాయులు చక్రధర్‌రావు, మల్లికార్జున్, ఉపాధ్యాయులు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.