
రోడ్డు కబ్జాపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
కేశంపేట: మండల పరిధిలోని సంగెం రెవెన్యూ పరిధిలోని పొల్కోనిగుట్ట తండాలో వీవీఆర్ వెంచర్‌లో రోడ్డు కబ్జాకు గురైనట్టు గ్రామస్తులు తహసీల్దార్ అజాంఅలీకి ఫిర్యాదు చేశారు. గతంలో సంగెం రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్లు 40, 41, 42, 43, 44లో వ్యవసాయ భూమిని వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కొనుగోలు చేసి వెంచర్ వేశారని.. ప్లాట్లు పూర్తి స్ధాయిలో అమ్మకాలు జరగకపోవడంతో అట్టి వెంచర్‌లోని ప్లాట్లను మళ్లీ వ్యవసాయభూమిగా విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంచర్‌లో రోడ్లుతో పాటుగా ఐదుగుంటల భూమిని వదిలేయడంతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశామన్నారు. ప్రస్తుతం వెంచర్ హద్దులను చేరిపివేయడంతో పల్లె ప్రకృతి వనానికి వెళ్లేందుకు రోడ్డు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంచర్‌లోని రోడ్లుతో పాటుగా పల్లె ప్రకృతి వనం రోడ్డును కబ్జా నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో తారాసింగ్, రవి, రాజేష్, సాయికుమార్, శంకర్, శ్రీను, రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.