
లైన్ క్లియర్!యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌కు మార్గం సుగమం
సాక్షి, సిటీబ్యూరో
ఎట్టకేలకు యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది. పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా నిర్మించేందుకు సన్నద్ధమైంది. ఘట్‌కేసర్ నుంచి యాదగిరిగుట్ట (రాయగిరి) వరకు 33 కి.మీ మార్గాన్ని కొత్తగా నిర్మించనున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించారు. ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూమి, వనరులు, నిధులు, ఇతర మౌలిక సదుపాయాలకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచుకోవాలని భావించారు. ఈ ఒప్పందానికి అనుగుణంగా 2016లో దక్షిణమధ్య రైల్వే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు లైన్‌ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించింది. అనంతరం ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు, ఒకటి, రెండు బడ్జెట్‌ల్లో కేంద్రం కొన్ని నిధులను కేటాయించింది. అదేస్థాయిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, వనరులు లభించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో రైల్వేశాఖ సైతం వెనకడుగు వేసింది. ఇలా 2016 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
ఇటీవల రూ.100 కోట్లు..
లక్షలాది మంది భక్తులు సందర్శించుకునే యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి రైల్వే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైల్వేశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఇక్కడికి ఎంఎంటీఎస్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత సంవత్సరమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకనుగుణంగానే ఇటీవల రూ.100 కోట్లు అందజేసింది. ప్రాజెక్టును ప్రతిపాదించిన మొదట్లో రూ.10 కోట్లు, ఆ తర్వాత రెండు దఫాలుగా రూ.60 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.430 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. పదేళ్ల జాప్యం వల్ల నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
సొంత నిధులతోనే పనులు..
రైల్వేశాఖ ఈ ప్రాజెక్టును సొంత నిధులతో నిర్మించనుందని ఆ శాఖ సహాయ మంత్రి రవనీత్‌సింగ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలోనూ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో ‘జీరో అవర్’లో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టుపై ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రైల్వేశాఖ సహాయమంత్రి రాతపూర్వకంగా తమ స్పందన తెలిపారు. అంతేకుండా ఈ ఆర్థిక సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టనున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు సైతం స్పష్టం చేశారు. త్వరలోనే రైల్‌వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) పనులు చేపట్టనుంది.
లక్షలాది మందికి ఊరట...
యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాదిమంది భక్తులకు గొప్ప ఊరట లభించనుంది. ప్రస్తుతం ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు,ప్రైవేట్ వాహనాల్లోనే ప్రయాణికులు యాదగిరిగుట్టకు రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నేరుగా పుణ్యక్షేత్రం వరకు వెళ్లే సదుపాయం లేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, చర్లపల్లి తదితర ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో నేరుగా రాయగిరి వరకు రాకపోకలు సాగించవచ్చు. అక్కడి నుంచి 4 కి.మీ. మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరంలో మొదటి, రెండో దశ ఎంఎంటీఎస్ ప్రాజెక్టులు పూర్తయినందువల్ల యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మూడో దశ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు లేకుండానే నిర్మించనున్న రైల్వేశాఖ
ఇటీవల స్పష్టం చేసిన ఆ శాఖ సహాయ మంత్రి
రూ.430 కోట్లతో 33 కి.మీ వరకు కొత్తగా ఎంఎంటీఎస్ లైన్‌లు
2015లోనే యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌కు ప్రతిపాదనలు
త్వరలో పనులు చేపట్టనున్న దక్షిణమధ్య రైల్వే